పాలేరు నుంచి పోటీ ..స్పష్టం చేసిన వైఎస్ షర్మిల

Ys sharmila

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం వేగంగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల.. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన షర్మిల.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. వైఎస్ఆర్‌కు పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలా అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభంజనాన్ని ఆపలేరని అన్నారు.

YS Sharmila: పాలేరు నుంచి పోటీ చేస్తా.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి ముందే ఉమ్మడి జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులు, సన్నిహితులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న షర్మిల.. ఎక్కువగా ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేస్తున్నారు. ఇందుకు అసలు కారణంగా గతంలో ఖమ్మం జిల్లా నుంచి వైసీపీ కొన్ని స్థానాలు గెలుచుకోవడమే. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంపై ఆమె ఆసక్తి చూపిస్తున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. ఆ తరువాత ఆయన చనిపోవడంతో ఉప ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఇక్కడి నుంచి టీఆర్ఎస్ నేతగా బరిలోకి దిగిన తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. అనంతరం ఆయన టీఆర్ఎస్‌లో చేరిపోయారు.

ఈ నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించారని.. ఇందుకు ఆమె కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతేకాదు పాలేరు నుంచి పోటీ చేయడం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభావం ఉంటుందని షర్మిల సన్నిహితులు భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సిద్ధమైన షర్మిల.. తాను పోటీ చేయబోయే స్థానాల విషయంలో పాలేరుకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.