తెలంగాణలో ‘గేరు’ మార్చిన వైఎస్ షర్మిల.! వ్యూహం ఫలిస్తోంది.!

ఆ మధ్య మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆ వ్యూహం పని చేసింది. నిజానికి, ఆమె అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారంతే. తొలుత నిరంజన్ రెడ్డి నోరు పారేసుకున్నారు, ఆ వ్యవహారంపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. విషయం స్పీకర్‌కి ఫిర్యాదు చేసేవరకూ వెళ్ళింది.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీద వైఎస్ షర్మిల విమర్శల వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని వైఎస్ షర్మిల టార్గెట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

పూటకో పార్టీ మార్చే జగ్గారెడ్డి.. అంటూ, రాజకీయ వ్యభిచారిగా ఆయన్ని అభివర్ణించారు వైఎస్ షర్మిల. దాంతో, జగ్గారెడ్డికి కోపమొచ్చింది. వైఎస్ షర్మిలపై ఆయన తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం వైఎస్ జగన్, వైఎస్ షర్మిల కలిసి నాటకమాడుతున్నారంటూ జగ్గారెడ్డి విమర్శించారు.

అంతే కాదు, వైఎస్సార్ మరణించిన బాధ వైఎస్ జగన్‌లోగానీ, వైఎస్ షర్మిలలోగానీ అప్పట్లో తాను చూడలేదని జగ్గారెడ్డి చెప్పడం గమనార్హం. ఏపీలో వైఎస్ షర్మిల రాజకీయం చేసుకోవాలని జగ్గారెడ్డి ఉచిత సలహా ఇచ్చారు. ఎలాగూ ఏపీకి మూడు రాజధానులంటున్నారు కదా.? ఏపీని మూడు ముక్కలు చేసి ముగ్గురూ (వైఎస్ జగన్, షర్మిల, విజయమ్మ) పరిపాలించుకోండని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.

‘నన్ను రాజకీయ వ్యభిచారి అంటావా.? ఆడబిడ్డవని ఆలోచిస్తున్నాను. మగాడితో మాట్లాడే మాటలేనా అవి.? నేను నోరు విప్పితే ఆ మాటల్ని నువ్వు తట్టుకోలేవ్. ఇంకా రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నీ మీద గౌరవం వుండబట్టే ఇలా మాట్లాడుతున్నా..’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే, వరుసగా ముఖ్య నేతల్ని టార్గెట్ చేస్తూ, తెలంగాణలో వైఎస్ షర్మిల తన ఇమేజ్‌ని పెంచుకుంటున్నారు. షర్మిల టాపిక్ లేకుండా ఈ మధ్య తెలంగాణ వార్తలు కన్పించడంలేదు. పాదయాత్రలో ఇప్పటిదాకా ఓ యెత్తు.. ఇప్పుడు ఇంకో యెత్తు.. అన్నట్లుంది వైఎస్ షర్మిల వ్యవహారం.