2024 ఎన్నికలపై వైఎస్ జగన్ ‘ముందస్తు’ దిశానిర్దేశం.!

YS Jagan Strict Directions

YS Jagan Strict Directions : పార్టీలో అంతర్గత కుమ్ములాటల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలకు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల కంటే కూడా గొప్ప విజయాన్ని అందుకోవాలంటే, అందరూ కలిసి కట్టుగా పని చేయాలనీ, చిన్నపాటి మనస్పర్ధల్నీ, అసంతృప్తుల్నీ పక్కన పెడితేనే మెరుగైన ఫలితాలు వస్తాయని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.

వైసీపీకి చెందిన ముఖ్య నేతలు, వివిధ అనుబంధ విభాగాల అధిపతులు, జిల్లాల అధ్యక్షులు, మంత్రులు.. ఇలా కీలక నేతలతో వైసీపీ అధినేత ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల విషయమై దిశానిర్దేశం చేశారు. మే 2 నుంచి గడప గడపకూ నాయకులు వెళ్ళాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

‘గడచిన మూడేళ్లలో మెరుగైన పాలన అందించాం. ఇంకా ఎక్కడైనా సమస్యలు వుండొచ్చు. వాటి గురించి ప్రజల్ని అడిగి తెలుసుకోండి. ప్రజలకు దగ్గరవ్వండి.. సరైన పని తీరు కనబర్చకపోతే ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కొనసాగించడం కుదరదు..’ అంటూ వైఎస్ జగన్ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చేశారట.

ఇదే విషయాన్ని భేటీ అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తుందనీ, వైసీపీ ఇందుకు అతీతమేమీ కాదనీ, ప్రభుత్వం పట్ల ప్రజల్లో మంచి భావన వున్నా, కొందరు నాయకుల విషయంలో అసంతృప్తి వున్న మాట వాస్తవమేనని కొడాలి నాని అంగీకరించారు.

చిన్న చిన్న సమస్యల్ని సరిదిద్దుకుంటామని కొడాలి నాని చెప్పగా, 175కి 175 సీట్లు గెలవడం గురించి ఆలోచిస్తున్నామంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.