Konijeti Rosaiah: వైఎస్ జగన్ మాస్టర్ స్ట్రోక్ నుంచి రోశయ్య తప్పించుకున్నారిలా.!

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో పని చేసిన విషయం విదితమే. అనూహ్యంగా ఆ పదవి ఆయన్ని వరించింది. ఎక్కువ కాలం ఆయన ఆ పదవిలో వుండలేకపోయారు. ‘ఏ క్షణాన అయినా నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసెయ్యొచ్చు..’ అని ఆయన అప్పట్లో తన సన్నిహితులతో చెప్పుకునేవారట.

అసలు విషయమేంటంటే, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రోశయ్య పేరు తెరపైకొచ్చింది. ‘నాకు ఆ పదవి వద్దు మొర్రో..’ అంటూ రోశయ్య వాపోయారట. మరోపక్క, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి అప్పటి కాంగ్రెస్ నేతలు చాలామంది ప్రయత్నించారు. ఆ సంగతి రోశయ్యకూ తెలుసు.

కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రోశయ్యను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టింది. అయితే, రాజశేఖర్ రెడ్డి అంటే రోశయ్యకు అమితమైన అభిమానం. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీలో నిఖార్సయిన కార్యకర్త రోశయ్య. అధిష్టానమంటూ విపరీతమైన భక్తి భావం ఆయనకు వుండేది.

వైఎస్ జగన్ తరఫున పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నుంచి రోశయ్య మీద అప్పట్లో చాలా ఒత్తిడి వుండేది. దాన్ని కొన్నాళ్ళపాటు ఆయన డీల్ చేయగలిగారుగానీ, ఎక్కువ కాలం ఆ పదవిలో వుండడం ద్వారా ఒత్తిడిని భరించలేనని అర్థం చేసుకున్న రోశయ్య, చాకచక్యంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు.

రోశయ్యను దించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పావులు కదిపారని అనలేంగానీ, వైఎస్ జగన్ మద్దతుదారులు మాత్రం, రోశయ్య మీద చాలా కుట్రలు చేశారంటారు. వాటిని ఆయన అత్యంత చాకచక్యంగా ఎదుర్కొన్నారు.. చాలా తెలివిగా తప్పించుకున్నారు కూడా.

నిజానికి, రోశయ్య అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ అభిమానమే. కానీ, ముఖ్యమంత్రి పదవి కారణంగా వచ్చిన సమస్య అది.