ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా మీద ప్రత్యేక దృష్టి సారించారు. తరతరాలుగా అక్కడ నెలకొన్న ఒకే తరహా రాజకీయ వాతావరణాన్ని మార్చి పడేశారు. అందుకు నిదర్శనమే కింజారపు, ధర్మాన కుటుంబాలు వ్యవహరిస్తున్న తీరు. ఉండటానికి రెండు కుటుంబాలు వ్యతిరేక పార్టీలోనే ఉన్నా వాటి మధ్యన మొదటి నుండి ఒక ఒప్పందం ఉందనే టాక్ ఉంది. కింజారపు కుటుంబం పెద్దగా ఎర్రాన్నాయుడు, ధర్మాన కుటుంబం నుండి ప్రసాదరావులు ఈ ఒప్పందం చేసుకున్నారని చెప్పుకుంటారు. ఈ ఒప్పందం ఏమిటంటే పైన ఏ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లాలో మాత్రం రెండు కుటుంబాల నుండి ప్రాతినిధ్యం ఉండాలి. ఒకరినొకరు చూసీ చూడనట్టు వెళ్ళిపోవాలి.
అంతేకాదు ఇరు కుటుంబాల వారు నేరుగా ఢీకొనకూడదన్నమాట. ఎవరికివారు వేరు వేరు చోట్ల పోటీ చేయాలి. ఒకవేళ అవసరైమైతే ఒకరి గెలుపు కోసం ఒకరు పార్టీ క్యాడర్ ను మేనేజ్ చేయాలి. ఇదే ఒప్పందం దశాబ్దాల తరబడి నడుస్తోందట. ఒక్కసారి గతంలోని ఎన్నికల ఫలితాలను చూసుకుంటే ఇదే నిజమనిపిస్తుంది. 99లో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ధర్మాన కృష్ణదాస్ కాంగ్రెస్ నుండి నరసన్నపేటలో గెలిచారు. ఈ గెలుపు వెనుక ఎర్రన్నాయుడు హ్యాండ్ ఉందని అంటారు. అలాగే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎర్రన్నాయుడు ఎంపీగా, అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇందుకు ధర్మాన కుటుంబం బాగా సహకరించిందని అప్పట్లో వార్తలొచ్చాయి.
ఇక గత ఎన్నికల్లో చూసుకుంటే వైకాపా అఖండ మెజారిటీతో గెలిస్తే టెక్కలి నుండి అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిచారు. వీరిలో రామ్మోహన్ నాయుడు గెలుపు ఎంత బొటా బోటీ మెజారిటీతో సాధ్యమైందో అందరికీ తెలుసు. ఈ ఫలితాలు వెనుక కూడ రేణు కుటుంబాల మధ్యన ఉన్న ఒప్పందమే కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఈ సంగతిని గతంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు పెద్దగా పట్టించుకోకపోయినా వైఎస్ జగన్ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఒప్పందాన్నీ బ్రేక్ చేస్తే తప్ప జిల్లా మీద పట్టు బిగించడం సాధ్యంకాదనే నిర్ణయానికి వచ్చిన ఆయన ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నారు.
గత ఎన్నికల్లో ధర్మాన సోదరులు ఇద్దరూ గెలిచినా జగన్ మంత్రి పదవిని కృష్ణదాస్ కు కట్టబెట్టారు. దీంతో ప్రసాదరావు ఒట్టి ఎమ్మెల్యేగానే మిగిలారు. మంత్రి పదవి దక్కడంతో కృష్ణదాస్ దూకుడు పెంచారు. జగన్ కింజారపు కుటుంబాన్ని గట్టిగా అణచివేయమని చెప్పడంతో కృష్ణదాస్ అదే పని మీదున్నారు, కానీ ప్రసాదరావు మాత్రం గత ఒప్పందం దృష్ట్యా మౌనంగానే ఉన్నారు. ఆయన్ను కూడ మార్చాలని జగన్ ట్రై చేస్తున్నారు. అచ్చెన్నాయుడు మీద యుద్ధభేరీ మోగిస్తేనే పార్టీలో ప్రాముఖ్యతనే కండిషన్ పెట్టారట. ఇక సీదిరి అప్పలరాజు, కిల్లి కృపారాణి, తమ్మినేని సీతారాంలు కూడ నలువైపుల నుండి అచ్చెన్నాయుడు మీద, రామ్మోహన్ నాయుడు మీద దాడికి దిగారు.
అచ్చెన్నాయుడు సైతం అధ్యక్ష పదవి దక్కడంతో, ఎంపీగా పార్టీలో ప్రాభల్యం పెరగడంతో రామ్మోహన్ నాయుడు ఇద్దరూ ఇక ఊరుకుండి లాభంలేదని తెరవెనుక స్నేహాలను చాలించి యుద్ధంలోకి దిగేశారు. దీంతో కింజారపు వెర్సెస్ ధర్మాన అనేలా ఉంది వాతావరణం. మొత్తానికి జగన్ సర్వ సైన్యాన్ని మోహరించి తరాలుగా రెండు కుటుంబాల మధ్యన ఉన్న స్నేహాన్ని విచ్చిన్నం చేసేశారు.