కేంద్రంపై యుద్ధమట.! వంగి వంగి దండాలెట్టడం సంగతేంటి.?

కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. రాష్ట్రానికి కేంద్రం తగిన సాయం చేయడంలేదనీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలేదనీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పోలవరం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా చెప్పడం గమనార్హం.

బీజేపీ మీద, కేంద్రం మీద ఈగ వాలనివ్వకుండా చూసకుంటున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడచిన మూడేళ్ళుగా. ‘ప్రత్యేక హోదా విషయమై కేంద్రాన్ని అడుగుతూనే వుంటాం.. అంతకన్నా ఏం చేయగలం.?’ అని చేతులెత్తేసిన వైఎస్ జగన్, ఇప్పుడేమో ‘యుద్ధం చేస్తున్నాం..’ అని చెబుతున్నారు.

బహుశా యుద్ధమంటే ఏంటో వైఎస్ జగన్ మర్చిపోయినట్టున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో వున్నప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేశారు కదా.. అదీ యుద్ధమంటే. ప్రతిపక్షంలో వున్నప్పుడు వైసీపీ ఎంపీలతో వైఎస్ జగన్ రాజీనామా చేయించారు కదా.. అదీ యుద్ధమంటే.

మరి, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నదేంటి.? కేంద్ర – రాష్ట్ర సంబంధాలు బావుండాలని.. అని చెబుతూ, కేంద్రంతో సఖ్యత కొనసాగిస్తున్నారు. అంతేనా, కేంద్రానికి అవసరమైనా.. అవసరం లేకున్నా తమ ఎంపీలతో చట్ట సభల్లో మద్దతిచ్చేలా చేస్తున్నారు.

ఢిల్లీలో వియ్యం.. రాష్ట్రంలో కయ్యం.. అన్నట్టు తయారైంది బీజేపీ – వైసీపీ పరిస్థితి. బీజేపీ నాయకులు వైసీపీని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నా, ‘దుష్టచతుష్టయం’లో బీజేపీని చేర్చేందుకు వైఎస్ జగన్ అస్సలు సాహసించడంలేదు. మరెలా, కేంద్రంతో యుద్ధం చేస్తున్నామని వైఎస్ జగన్ అనగలుగుతున్నారట.?