ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సుమారు 17 మంది ప్రతినిథుల బృందం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంది. దావోస్‌లో జరిగిన ఈ ఆర్థిక సదస్సు నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 1,25 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాల్ని ఆయా సంస్థలతో కుదుర్చుకుంది.
ఆయా సంస్థలు, రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నాయి. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. గ్రీన్ ఎనర్జీ విభాగంలో అదానీ సంస్థ సహా, వివిధ సంస్థలు తమ తమ పెట్టుబడుల్ని ఆయా రంగాల్లో పెడతామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఇంతకీ, వైఎస్ జగన్ దావోస్ పర్యటనతో ఆ పెట్టుబడులన్నీ రాష్ట్రానికి వచ్చేసినట్లేనా.? అంటే, ప్రస్తుతానికైతే అవగాహనా ఒప్పందాలు కుదిరాయ్. అవి కార్య రూపం దాల్చలంటే అది మళ్ళీ చాలా పెద్ద కథ. చంద్రబాబు హయాంలో కూడా దావోస్ హంగామా నడిచింది. అప్పుడూ పెద్దయెత్తున ఒప్పందాలు కుదిరాయ్.
దావోస్ సదస్సులు పక్కన పెడితే, విశాఖపట్నంలో కూడా సదస్సులు జరిగాయి.. ప్రపంచ స్థాయిలో వివిధ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగిన సదస్సుల్లో హంగామా చేశాయి. మరి, ఆ సదస్సుల్లో జరిగిన ఒప్పందాలు ఏమయ్యాయ్.? అంటే, దానిపై ప్రభుత్వ పరంగా ఇదమిద్ధమైన సమాచారం ఎప్పుడూ అందుబాటులో వుండదు.
వైఎస్ జగన్ దావోస్ పర్యటన అట్టర్ ఫ్లాప్.. అంటూ విపక్షాలు ప్రచారం చేయడం మామూలే. వైఎస్ జగన్ దావోస్ టూర్ సూపర్ హిట్ అని అధికార వైసీపీ చెప్పుకోవడమూ మామూలే. రాష్ట్రానికి నిజంగా ఒరిగేదేంటి.? అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఓ చిన్న ఆశ.. రాష్ట్రం బాగుపడాలి.. పెట్టబుడులు రాష్ట్రానికి రావాలి.!