వైఎస్ జగన్ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ.. అంతా కన్ఫ్యూజనే.!

ఐదేళ్ళ పాలనా కాలాన్ని రెండు భాగాలుగా విభజించి, మంత్రి పదవుల పంపకం చేపట్టనున్నట్లు తొలిసారి ముఖ్యమంత్రి అవుతూనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. దాంతో, మొదటి దఫాలో అసంతృప్తులు పెద్దగా తమ అసంతృప్తిని బయటపెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. రెండేళ్ళు పూర్తవుతోంది. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణను వైఎస్ జగన్ ఎప్పుడు చేపడతారు.? అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది వైసీపీ నేతల్లో. చాలామంది మంత్రులు తమ పదవులు పోగొట్టుకోవడం ఖాయమనే బెంగతో విలవిల్లాడుతున్నారు. ఆశావహులు తమకు పదవులు దక్కుతాయా.? లేదా.? అన్న ఉత్కంఠతో కంగారు పడుతున్నారు. వాళ్ళకీ, వీళ్ళకీ.. మొత్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గందరగోళమైతే కనిపిస్తోంది. కానీ, పైకి ఎవరూ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి.

‘వైఎస్ జగన్ ఆదేశిస్తే, మంత్రి పదవి నుంచి వైదొలగుతాం.. పార్టీ కోసం పని చేస్తాం..’ అని కొందరు వైసీపీ ముఖ్య నేతలు (మంత్రి పదవుల్లో వున్నవారు) ఇప్పటికే ప్రకటించారు. కానీ, పైకి చెప్పే మాటలకీ.. పదవి మీద మమకారానికీ అస్సలు పొంతన వుండదు. పదవి వదులుకునేందుకు ఎవరూ సిద్దపడరు. వదులుకోవాల్సి వస్తే మాత్రం, కొందరు తిరుగుబాటు బావుటా ఎగరవేయడానికీ వెనుకాడకపోవచ్చు. అందుకే, వైఎస్ జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారట. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ విషయమై ఎక్కడా ఎవరితో మాట్లాడకూడదంటూ వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పైకి ఆ విషయాలపై అంతా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. లోలోపల మాత్రం రగిలిపోతున్నారు. రెండున్నరేళ్ళ పాలనలో వైఎస్ జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో వుందంటూ ఇటీవల వెలుగు చూసిన ఓ సర్వే తర్వాత ఈక్వేషన్స్ మరింతగా మారినట్లే కనిపిస్తోంది పరిస్థితి.