వైఎస్ జగన్ ఎవరినైనా ఒక్కసారి నమ్మితే ఖచ్చితంగా దారి చూపిస్తారు. జగన్ నమ్మకాన్ని పొందిన చాలామంది వ్యక్తులు ఇప్పుడు వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా చక్రం తిప్పుతున్నారు. కానీ కొందరికి మాత్రం పరిస్థితులు అనుకూలించక టికెట్లు దొరకలేదు. తమ సామాజికవర్గం తాము పనిచేస్తున్న నియోజకవర్గం కేటాయించబడిన సామాజికవర్గంలో లేకపోవడంతో కొందరు టికెట్లు పొందలేకపోయారు. టికెట్ గనుక దక్కి ఉంటే వారు ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులే. అలాంటి వారిలో మేడవరపు అశోక్ బాబు ఒకరు. ఈయన జగన్ కు అత్యంత నమ్మకస్తుడు.
ఈయన కెవిపి రామచంద్రరావుకు బావమరిది. తెలుగు రాజకీయాల్లో కేవీపీ రామచంద్రరావు పరిచయం అక్కర్లేని పేరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు. ఆయనకు వైఎస్ ఆత్మ అనే మారుపేరు కూడ ఉంది ఈయనకు. వైఎస్ఆర్ నమ్మకాన్ని అత్యంత ఎక్కువగా చూరగొన్న వ్యక్తుల్లో కెవిపి ప్రథముడు. కెవిపి సలహా లేకుండా రాజశేఖర్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకునేవారు కాదు. వైఎస్ఆర్ ఆదేశిస్తే కెవిపి ఆచరించేస్తారు. అంత విజయవంతంగా ఉండేది వారిద్దరి కాంబినేషన్. అశోక్ బాబుది కూడ కేవీపీ తత్వమే. కేవీపీ వైఎస్ఆర్ కు చేరువైతే అశోక్ బాబు జగన్ కు దగ్గరయ్యారు. చింతలపూడి నియోజకవర్గంలో పార్టీని నడిపిస్తున్నది ఈయనే. ఆ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయింది కానీ లేకుంటే టికెట్ అనుమానం లేకుండా అశోక్ బాబుకే దక్కేది. అయితే పదవి లేకపోయినా నియోజకవర్గంలో అశోక్ బాబుకు ఎమ్మెల్యేను మించిన పలుకుబడి ఉంది.
చింతలపూడి రాజకీయం మొతం ఈయనే చూసుకుంటున్నారు. జగన్ వద్ద మంచి సాన్నిహిత్యం ఉండటం, సౌమ్యుడనే పేరుండటంతో అశోక్ బాబుకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఈయనకు కలిసిరానుంది. కొత్త జిల్లాలు పెడితే జంగారెడ్డిగూడెం కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పడుతుంది. ఎలాగూ చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి జంగారెడ్డిగూడెం జనరల్ కోటలోకి వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే ఇంకో ఆలోచన లేకుండా అశోక్ బాబుకు టికెట్ ఇచ్చేస్తారు జగన్. ఎలాగూ బలమైన వెలమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అశోక్ బాబు గెలుపు నల్లేరు మీద నడకే. కాబట్టి పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఎన్నికల్లో ఈయన నిలబడటం, గెలవడం ఖాయం. ఇక అధికారికంగా జగన్ పక్కనే ఉన్నారంటే మరొక కెవిపి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.