గవర్నర్ ప్రసంగం అంటే.. అది ప్రభుత్వం చెప్పే మాటే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం, వర్చువల్ విధానం ద్వారా జరిపారు. అసెంబ్లీలో అది లైవ్ టెలికాస్ట్ అయ్యింది. ఈ సందర్భంగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. కరోనా కష్టాలున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. నిజమే, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో అస్సలేమాత్రం వెనక్కి తగ్గడంలేదు. మామూలు రోజుల్లో అయితే, సంక్షేమంతోపాటు అభివృద్ధి కూడా జరిగి తీరాలి. నిజానికి, అభివృద్ధి ద్వారా వచ్చే ఫలితాలతో సంక్షేమ పథకాల్ని సమర్థవంతంగా అమలు చేయాలి. కానీ, అప్పులతో సంక్షేమ పథకాల్ని నడపాల్సిన దుస్థితి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన కారణంగా వచ్చిన ఇబ్బందికర పరిస్థితి ఇది.
చంద్రబాబు హయాంలో కూడా అభివృద్ధి జపం చేసినా, ఆ అభివృద్ధి కంటే సంక్షేమంపైనే ఎక్కువ ఫోకస్ నడిచింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక, అభివృద్ధి అంశం దాదాపు పక్కకు వెళ్ళిపోయింది. అందుక్కారణం కరోనా ప్రభావం కూడా. కరోనా కారణంగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా గతి తప్పింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే నానా తంటాలూ పడాల్సి వస్తోంది. అయినాగానీ, సంక్షేమ పథకాలు మాత్రం ఆగడంలేదు. కరోనా నేపథ్యంలో జనం ఇళ్ళకే పరిమితమవుతున్న దరిమిలా, పేదలకు సంక్షేమ పథకాలు పెద్ద ఊరటగా మారాయి. సంక్షేమ పథకాల కారణంగా పేదలకు నేరుగా నగదు లబ్ది జరుగుతోంది. వైద్య ఆరోగ్య రంగంలోనూ ఇతరత్రా విభాగాల్లోనూ వైఎస్ జగన్ సర్కార్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు ఊరటగా మారాయి. అయితే, కరోనా ప్రభావం తగ్గాక పరిస్థితి ఏంటి.? ఇప్పుడు చేసిన అప్పులకి భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తే.. బాధ్యత ఎవరు తీసుకుంటారు.? అలా ఆలోచించే సమయం ప్రస్తుతానికి ప్రజలకి కూడా లేదేమో.. ఎందుకంటే, కరోనా అంతలా భయపెట్టేస్తోంది మరి.