వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు తెగిపోకుండా సాగుతున్న అంశం ఏంటంటే.. ఏపీ రాజధాని విషయం.. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, టీడీపీ, జనసేనలకు మధ్య నాటి నుండి నేటి వరకు వార్ నడుస్తూనే ఉంది.. ఇలా ఏపీలో దుమారం చెలరేగుతున్న వేళ మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది.. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఈ రాజధానుల రగడ ఆరిపోకుండా రగులుతూనే ఉంది.. ఇదే సమయంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల నుండి కూడా వ్యతిరేకత ఎదురవుతుంది..
రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలను ఎండగడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.. ఇదే కాకుండా ఏపీలో ఉన్న బిజేపీ నాయకులు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.. అదే సమయంలో జనసేన పార్టీ, బీజేపీతో కలిసి నడవాలని, వచ్చే నాలుగేళ్ళలో ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని నిర్ణయించుకుని, ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకుని, ఏకాభిప్రాయంతో ఏపీలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం గతంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు.. ఇంతవరకు బాగానే ఉన్నా అమరావతి విషయంలో మాత్రం ఈ రెండు పార్టీలు విభిన్న వైఖరితో వెళుతుండటం, ఒకరికి ఒకరు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తు ఉండటంతో జనసేన బీజేపీ పొత్తులపై అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా జనసేన పార్టీ ఏపీ రాజధాని అమరావతినే కొనసాగించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే వస్తోంది.
ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ, రాష్ట్ర రాజధాని అంశం తమ పరిధిలోనిది కాదని, అది ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని.. ఆ రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని ఇందులో కేంద్రం కలుగజేసుకోలేదనే కబురు చెప్పింది.. ఇదిలా ఉండగా వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో రెండుసార్లు కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశమై, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించడమే కాకుండా, ఏపీకి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధులు రూ.2254.52 కోట్లు విడుదల చేయాలని.. రాష్ట్రానికి రూ.3,622.07 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.4006.43 కోట్లు తక్షణమే విడుదల చేయాలని.. పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఇలా ఏపీలోని ప్రతి సమస్యను ఏకరువు పెట్టారు.. దీంతో జగన్ ప్రతిపాదనను ఆమోదించి వెంటనే అమలు చేయాలా లేదా అన్నది బీజేపీ పెద్దలు తేల్చుకోవాలి.. ఎందుకంటే రానున్న రోజుల్లో బీజేపీకి, వైసీపీ మద్దతు చాలా అవసరం.. మొత్తానికి ఈ సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్న వైఎస్ జగన్ బీజేపీ పెద్దల్లో హై టెన్షన్ క్రియోట్ చేసారు..