ఆట ఇప్పుడే మొదలైంది.. ఎత్తులకు పై యెత్తులు వేస్తున్నారు.. ఇంతలోనే ఎవరు గెలిచారన్నది చెప్పలేం. మీసం మెలేసి, తన గెలుపు గురించి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సంకేతాలు ఇవ్వొచ్చుగాక. కానీ, అసలు కథ ముందుంది. ఎంపీ రఘురామకు ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఆయన అదే ఆసుపత్రిలో వుంటారు. జ్యుడీషియల్ కస్టడీగా ఈ సమయాన్ని సుప్రీంకోర్టు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ నెల 21న బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. ఆ రోజు కీలక నిర్ణయం సుప్రీంకోర్టు నుంచి, రఘురామకు అనుకూలంగా వస్తే.. ఆయన గెలిచినట్లే. అదే సమయంలో, రఘురామకు బెయిల్ రాకుండా ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు గట్టిగానే సాగుతాయి. ఇందులో ఇంకోమాటకు తావు లేదు. అయితే, ఈలోగా రఘురామ తరఫున, వైఎస్ జగన్ ప్రభుత్వం తరఫున.. సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య వాదోపవాదాలు గట్టిగా జరుగుతున్నాయి. రఘురామ అరెస్టుతో జగన్ సర్కార్ గెలిచిందనే భావన కొందరిలో వ్యక్తమవుతోంది.
రఘురామని లోపలేసి కుమ్మేశారంటూ వైసీపీ అనుకూల వర్గం పండగ చేసుకుంది. దానికి అనుగుణంగానే తనను కొట్టారంటూ ఎంపీ రఘురామ, తనకు అయిన గాయాల్ని కోర్టు ముందుంచారు. ‘అబ్బే, మేం కొట్టలేదు..’ అన్నట్టు ఏపీ సీఐడీ తరఫున కోర్టులో వాదనలు వినిపించాయి. ఏపీ సీఐడీ అంటే, అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమే కదా. అవి కొట్టడం వల్ల అయిన గాయాలా.? కాదా.? అన్నది తేల్చాల్సింది ఆర్మీ ఆసుపత్రి. గాయాలు కనిపిస్తున్న మాట నిజమే గనుక, ‘కొట్టలేదు’ అని ఆర్మీ ఆసుపత్రి చెప్పకపోవచ్చన్నది నిపుణుల వాదన. గాయాలు ఎలా అయ్యాయన్నది ఇలాంటి సందర్భాల్లో ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. నిజానికి, దేశ రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఎంపీగా రఘురామకు కొన్ని ప్రివిలేజెస్ వుంటాయి. ఆ కోణంలో చూస్తే, ఆయనదే పై చేయి కావొచ్చు. అలాగని రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా లైట్ తీసుకుంటుందని అనుకోగలం.?