వైఎస్ జగన్‌కి నారా లోకేష్ సవాల్: ఎవరి సత్తా ఎంతో తేలిపోతుంది.!

Ys Jagan Vs Nara Lokesh

Ys Jagan Vs Nara Lokesh

ఎమ్మెల్యే అవలేక, ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకుని.. మంత్రి పదవి సొంతం చేసుకున్న నారా లోకేష్ ఎక్కడ.? తన కష్టంతో పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ.? సరే, రాజకీయాల్లో గెలుపోటములు సహజం అనుకోండి.. అది వేరే సంగతి. తిరుపతి ఉప ఎన్నిక వేళ నారా లోకేష్, కాస్త హద్దులు దాటి వ్యవహరిస్తున్నారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే క్రమంలో. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో తగిలిన దెబ్బని మర్చిపోయి, పార్టీలో కొత్త ఉత్సాహం నింపాలన్న లోకేష్ ప్రయత్నాన్ని తప్పు పట్టలేం. అయితే, లోకేష్ తాజాగా విసిరిన సవాల్ మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.

‘వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు మాకూ సంబంధం లేదని నేను వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తాను.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తమ కుటుంబానికి వైఎస్ వివేకా హత్యతో సంబంధం లేదని ప్రమాణం చేయగలరా.?’ అని సవాల్ విసిరేశారు నారా లోకేష్. లోకేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెను దుమారం చెలరేగుతోంది. చంద్రబాబు హయాంలోనే వైఎస్ వివేకా హత్య జరిగింది. ఒకవేళ వైఎస్ జగన్ కుటుంబానికి ఆ హత్యతో సంబంధం వుండి వుంటే, అప్పట్లోనే అరెస్ట్ చేసి జైలుకు పంపేవారే. అప్పట్లో పెద్దయెత్తున ఇరు పక్షాల మధ్యా ఆరోపణల పర్వం నడిచింది. చంద్రబాబుపైనా వైఎస్ జగన్ విమర్శలు చేశారు.. చంద్రబాబుకి వైఎస్ వివేకా హత్యతో సంబంధముందని. అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్, ఆ దిశగా విచారణ చేపట్టి.. చంద్రబాబుని లోపలేయించలేకపోయారు. ఇంతకీ వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారు.? రెండేళ్ళయినా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు. రాజకీయాల్లో ప్రమాణాలకు అస్సలు విలువ లేదు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లో వైసీపీ – టీడీపీ మధ్య ప్రమాణాల పర్వం ఎంత ఘనంగా జరిగిందో చూశాం. అయితే, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారానికి సిద్ధమవుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, లోకేష్ అత్యంత వ్యూహాత్మకంగా ‘లాక్’ చేసేశారని చెప్పొచ్చు. ఈ సవాల్‌పై వైసీపీ నేతలు స్పందిస్తే సరిపోదు, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిందేనేమో.