ప్రస్తుతం ఏపీలో తిరుమల డిక్లరేషన్ పై విపరీతంగా చర్చ నడుస్తోంది. డిక్లరేషన్ కాస్త రాజకీయ దుమారం లేపుతోంది. తిరుమలలో డిక్లరేషన్ అవసరమా? అంటూ అధికారపక్షం వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిపక్షాలకు తిరుమల డిక్లరేషన్ అంశం దొరకడంతో అధికార పార్టీపై, సీఎం జగన్ పై రెచ్చిపోతున్నారు. సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చే తిరుమల ఆలయంలో అడుగుపెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదం ముదురుతున్నప్పటికీ.. సీఎం జగన్ మాత్రం తన మనసు మార్చుకోలేదు. తిరుమల శ్రీవారి పర్యటనకు వెళ్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన తిరుమల పర్యటనకు బయలుదేరుతారు.
ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీ నుంచి సీఎం జగన్ డైరెక్ట్ గా రేణిగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారు.
అనంతరం ఆయన పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5.30 కు అన్నమయ్య భవన్ నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. సాయంత్రం 6.15 కు బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం జగన్.. తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత రాత్రి 7.30 కు తిరుమల స్వామివారి గరుడసేవలో పాల్గొంటారు.
24 వ తారీఖున ఉదయం 6.15 నిమిషాలకు వీఐపీ విరామ సమయంలో సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ఉదయం 7 నుంచి 8 వరకు సుందరాకాండ పఠనంలో పాల్గొంటారు. తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి కర్ణాటక భవనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 24న రాత్రి 10.20 నిమిషాలకు రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి.. గన్నవరానికి చేరుకుంటారు.