ఆంధ్రపదేశ్ రాజధాని (వైఎస్ జగన్ ప్రభుత్వం అంగీకరించినా అంగీకరించకపోయినా) అమరావతి పరిధిలో అత్యంత హేయమైన ఘటన జరిగింది. ఓ యువతిపై, ఆమెకు కాబోయే భర్త సమక్షంలోనే లైంగిక దాడి జరిగింది. అదీ, అమరావతిలో.. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఆ ప్రాంతం చుట్టూ వుంటాయి. అలాంటిది.. కృష్ణా నది ఒడ్డున.. యువతిపై లైంగిక దాడి జరగడమేంటి.? బాధితురాలికి ఆర్థిక సాయం ప్రకటించడాన్ని తప్పు పట్టలేం. నిందితుల్ని పట్టుకోవడంలో పోలీసులు అత్యంత వేగాన్ని ప్రదర్శించడమూ అభినందించాల్సిందే.
కానీ, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో గడచిన రెండేళ్ళలో చాలానే జరిగాయి. రాజమండ్రి సమీపంలో ఓ దళిత మహిళపై లైంగిక దాడి ఉదంతం అప్పట్లో పెను రాజకీయ దుమారానికి కారణమైంది. ఆ తర్వాత మరో గటన.. అంతకు ముందు మరో ఘటన.. ఇలా ఘటనలు జరుగుతూనే వున్నాయి. విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడం మామూలే.
కానీ, ప్రభుత్వం ఏం చేస్తోంది.? నిర్భయ చట్టం దేశంలో వుంది.. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో దిశ చట్టం కోసం జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది. కేంద్రం ఈ చట్టం విషయమై కొన్ని మెలికలు పెడుతోంది. కానీ, దిశ పేరుతో రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక వాహనాలు.. వాటికి వైసీపీ రంగులు.. ఇదంతా కథ నడుస్తోంది. దిశ యాప్ పట్ల ప్రజల్లో.. ముఖ్యంగా మహిళల్లో అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మంచిదే.. కానీ, నేరస్తులకు శిక్ష పడినప్పుడే కదా.. ఆ ప్రచారాల వల్ల ఉపయోగం.!