వైఎస్ జగన్ ఆపాలని ఎంతగానో ప్రయత్నించిన పంచాయతీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీంతో వాదులాటకు చెక్ పెట్టి పోటీకి రెడీ అవుతోంది వైసీపీ. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎంతో ఉత్సాహంగా ఎన్నికల బరిలోకి దూకుతోంది. ఇప్పటికే సమీక్షలు, సమావేశాలు, అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకునే పనులు మొదలయ్యాయి. దీంతో జగన్ సైతం పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టారట. జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తోంది. నిజం చెప్పాలనే ఈ రెండేళ్లు ఆయన పార్టీని పెద్దగా పట్టించుకున్నది లేదు. అసలు గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలను ఆయన కలివలేదనే టాక్ కూడ ఉంది.
పార్టీ వ్యవహారాలన్నింటినీ కోటరీ నాయకులే చూసుకుంటున్నారు. జగన్ గత ఏడాది మధ్యలోనే మొత్తం జిల్లాలను మూడు భాగాలుగా విభజించి ముగ్గురు నాయకులకు అప్పగించారు. ర్నూల్, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల భాద్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించిన సీఎం ఉభయగోదావరి జిల్లాలు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు భాద్యతలను సొంత బంధువు వైవీ సుబ్బారెడ్డికి అలాగే శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల భాద్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. జిల్లాల రాజకీయాలన్నీ వీరి కనుసన్నల్లోనే నడిచాయి. పార్టీ పరంగా ఏది చేయాలన్నా వీరి ఆమోదం ఉండాల్సిందే. ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరి ఆదేశాల ,మేరకే నడుచుకుంటున్నారు.
అయితే నిత్యం పార్టీలో ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. సొంత నాయకుల్లోనే బోలెడన్ని వర్గ విబేధాలు బయటపడ్డాయి. బహిరంగంగానే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పైచేయి సాధించే ప్రయత్నాలు జోరుగా సాగాయి. ఫలితంగా నేతలు వార్తల్లో నిలవాల్సి వచ్చింది. అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు కానీ పాలన పరమైన, క్రమశిక్షణకు సంబంధించిన విమర్శలే అధికంగా ఉన్నాయి. చాలామంది లీడర్లు నోటి దురుసుతో జనం అసహనానికి గురయ్యారు. అభివృద్ధి జరగలేదనే ఆగ్రహం జనంలో ఉంది. పైపెచ్చు వాలంటీర్ వ్యవస్థ మూలాన నాయకులకు ప్రజలకు ప్రత్యక్ష సంబంధం లేకుండా పోయింది. తెలుగుదేశం, జనసేనలు ఎంతో కొంత పుంజుకున్నాయి. ఈ కారణాల వలన స్థానిక ఎన్నికలు వైసీపీకి నల్లేరు మీద నడక మాత్రం కాదనేది స్పష్టమవుతోంది.
అందుకే జగన్ బాధ్యతలు అప్పగించిన ముగ్గరు నాయకుల పర్నితీరు మీద పూర్తిస్థాయి సమీక్ష చేసుకుంటున్నారట. ఎవరి పనితీరు ఎలా ఉంది, ఎక్కడెక్కడ పార్టీ బలపడింది, ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ఈ రేండేళ్లలో జనం అభిప్రాయంతో ఎలాంటి మార్పులు వచ్చాయి లాంటి విషయాలను బేరీజు వేసుకుంటున్నారట. ఈ సమీక్షల ఫలితంగానే జగన్ పంచాయతీ ఎన్నికల కార్యాచరణను రూపొందించుకోనున్నారట.