విజయసాయిరెడ్డికి ఇంకొన్ని పవర్స్ కట్ చేసిన జగన్

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  ఆ పరిణామాలు ఎన్నికల ముందు, ఆ తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరించిన ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఉండటమే ఇక్కడ విశేషం.  వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటరీ పార్టీ అధినేతగా, ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయసాయి రెడ్డి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.  వాటిలో ఒక కీలక బాద్యత ఇప్పుడు ఆయన్నుండి వెళ్లిపోనుంది.  అదే ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి. 
 
ఈ పదవిని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లంకు అప్పగించనున్నారట జగన్.  ఇంతకుముందు వరకు అజేయ కల్లం సీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆయన్ను ఆ బాద్యతల నుండి తప్పించిన సీఎం ఆయనకు విశేషమైన ఢిల్లీ భాద్యతను అప్పగిస్తే బాగుంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట.  అజేయ కల్లం అంటే వైఎస్ జగన్ కు చాలా మంచి గురి ఉంది.  ఆయన సలహాలు, సూచనలకు జగన్ చాలా ప్రాముఖ్యత ఇస్తారు.  గతంలో ఆయన సలహాల ద్వారా జగన్ చాలానే ప్రయోజనాలు పొందారు.  ఒక్కమాటలో చెప్పాలంటే అజేయ కల్లం పూర్తిగా జగన్ మనిషి.  జగన్ ఆలోచనా విధానాన్ని, అవసరాన్ని పసిగట్టి గైడ్ చేయగల సత్తా ఉన్న అధికారి. 
 
పైగా ఆయనకు ఆర్థిక వ్యవహారాల మీద, ఢిల్లీ రాజకీయ విధానాల మీద కూడా మంచి పట్టుంది.  అందుకే విజయసాయిరెడ్డిని తప్పించి ప్రధాన కార్యదర్శిగా కల్లంను నియమిస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని సీఎం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.  ఏది ఏమైనా ఇలా ఢిల్లీలో ప్రభుత్వాన్ని రెప్రెజెంట్ చేసే పవర్స్ పోవడం విజయసాయిరెడ్డి ప్రాధాన్యతను ప్రశ్నార్థకం చేసే అవకాశం లేకపోలేదు.  కొన్నిరోజుల క్రితమే రాష్ట్రంలో జిల్లాల పర్యవేక్షణ అధికారాలను విభజించి సాయిరెడ్డి షాక్ ఇచ్చారు జగన్.  ఈ పరిణామాలన్నీ పార్టీలో ఆయన ప్రాముఖ్యత తగ్గుతోందనే సంకేతాలిస్తున్నాయి.  ఈ విషయాన్ని బేస్ చేసుకుని టీడీపీ నేతలు విజయసాయిరెడ్డి మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడం మాత్రం ఖాయం.