ఏ ముఖ్యమంత్రి పనితీరు అయినా బాగుందో లేదో చెప్పాలంటే ఆ రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో కట్టడి చేయబడి ఉంది, వ్యవసాయరంగం స్థితి గతులు ఎలా ఉన్నాయి అనేది అంచనా వేస్తారు. ఎందుకంటే ఆ రెండే రాష్ట్ర అభివృద్దికి మూలమవుతాయి కాబట్టి. అందుకే ఏ సీఎం అయినా ఈ రెండు అంశాల మీదే ఎక్కువ ద్రుష్టి పెడుతుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం వ్యవసాయరంగం మీద ఎక్కువ కృషి చేశారు. అందుకే ఈరోజు గతంలో ఏ ముఖ్యమంత్రికీ సాధ్యం కాని ఘనతను సాధించనున్నారు. జగన్ సీఎం అయిన దగ్గర్నుండి నీటి ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏపీకి రావలసిన నీటి వాటాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుకుంటూ ప్రధాన ప్రాజెక్టుల్లో నీరు నిండుకునేలా చేశారు.
అందుకే గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 1,00,44,463 ఎకరాలు అంటే కోటి ఎకరాల ఆయకట్టుకు ప్రాజెక్టుల ద్వారా నీరు అందించి రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ యేడాది కూడ అదే స్థాయిలో కృషి చేశారు. ప్రభుత్వ కృషికి తోడు వర్షాలు కూడ విస్తారంగా కురవడంతో ప్రాజెక్టులన్నీ నీటి కుండలా మారాయి. దీంతో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో గత ఏడాదిని మించి 1,11,41,471 ఎకరాలకు నీరు అందివ్వాలనే సంసిద్దతలో ఉన్నారు. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల ద్వారా ఇప్పటికే 52 లక్షల ఎకరాల ఆయకట్టులో రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
సోమశిల, కండలేరు, మైలవరం, విలిగోడు, పెన్నా బేసిన్లలో 115 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో 561 టీఎంసీల నీరు చేరింది. వీటి ద్వారా కోటి 11 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనేది ప్రభుత్వం లక్ష్యం. దీంతో గతేడాది నమోదైన కోటి ఎకరాల రికార్డ్ బద్దలు కానుంది. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వారు కూడ నీటి ప్రాజెక్టుల ద్వారా భారీ స్థాయిలో ఆయకట్టుకు నీరు అందించాలని అనుకున్నారు. కానీ ఒక సీజన్లో కోటి ఎకరాల మార్క్ అందుకోలేకపోయారు. అయితే జగన్ మాత్రం అన్నీ కలిసిరావడంతో వరుసగా రెండో సంవత్సరం కూడ ఖరీఫ్ సీజన్లో కోటి ఎకరాల మార్క్ దాటి రైతుల మన్ననలు పొందుతున్నారు.