వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం కోసం సిద్ధమవుతున్నారన్న వార్త విపక్షాల్లో కలవరం రేపుతోంది. 5 లక్షల మెజార్టీ లక్షంగా తిరుపతి ఉప ఎన్నిక పోరుని అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ తీసుకున్న విషయం విదితమే. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమేమీ కాదనీ, మెజార్టీనే తమ ముందున్న లక్ష్యమనీ వైసీపీ అంటోంది. కానీ, తిరుపతి వైసీపీ అభ్యర్థి చాలా వీక్.. అనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ప్రసంగం ఎక్కడా వినిపించలేదు. కానీ, ఆయన తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన ఇతర కీలక నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థి ఎవరైనాసరే, గెలుపు విషయంలో తేడా వుండదని అభ్యర్థి పేరు ప్రకటనకు ముందు వైసీపీ చెప్పింది. కానీ, కింది స్థాయిలో పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి.
వైసీపీ తిరుపతి లోక్ సభ అభ్యర్థి చాలా డల్‌గా కనిపిస్తున్నారు. అది ఖచ్చితంగా ఓటర్లపై ప్రభావం చూపుతుంది. తక్కువ సమయంలోనే అభ్యర్థి పేరుని ఖరారు చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. వృత్తి రీత్యా ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తి, రాజకీయ ప్రసంగాలు ఎప్పుడూ చేసింది లేదు. దాంతో, వైసీపీకి ఈ వ్యవహారం కొంత మింగుడుపడ్డంలేదు. మరోపక్క, అధినేత వైఎస్ జగన్ రంగంలోకి దిగడం ఖాయమైన దరిమిలా, వార్ వన్ సైడే అవుతుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాస్తవానికి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి సైతం వైఎస్ జగన్ దూరంగా వుండాలనుకున్నారట. అయితే, సిట్టింగ్ ఎంపీ మృతి పట్ల తిరుపతి పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేయడం.. కొంత వైసీపీకి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. అలాగని జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థికి, వైసీపీని సమర్థవంతంగా ఢీకొట్టే సీనుందా.? అంటే మాత్రం లేదనే చెప్పాలి.