ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు ఇంకో 12 కొత్త జిల్లాలను కలిపి మొత్తం 25 జిల్లాలుగా చేయాలనేది ఆలోచన. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయనున్నారు. ఈ మేరకు రానున్న కొత్త జిల్లాలు ఏవి, వాటిలోకి చేరబోయే మండలాలు ఏవి అనే విషయాలపై చర్చలు నడుస్తున్నాయి. పాత జిల్లాల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు కొత్త జిల్లాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది ప్రభుత్వం. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది ఉగాది పండుగ నాడు కొత్తగా ఏర్పాటుకానున్న జిల్లాలను ప్రకటిస్తారు జగన్.
మరోవైపు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు పలు జిలాల్లో విస్తరించి ఉన్నాయి. అందుకే వాటి విభజన కొంచెం క్లిష్టమవుతోంది. అంతేకాక కొన్ని జిల్లాలో జిల్లా కేంద్రాన్ని తమ ప్రాంతాల్లోనే ఏర్పాటుచేయాలనే డిమాండ్లు వినబడుతున్నాయి. ఒక ప్రాంతాన్ని కాదని ఇంకొక ప్రాంతానికి కేంద్రాన్ని కేటాయిస్తే పొరపచ్చాలు రావొచ్చు. అందుకే సమస్యాత్మక ప్రాంతాలను కొత్త జిల్లాలుగా చేయాలనే ఆలోచన కూడ ఉంది. అదే జరిగితే జిల్లాలు 23 కాదు 32 అవ్వొచ్చు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక చోటు చేసుకుంటున్న కీలక పరిణామం ఇదే కావడంతో ప్రజలంతా ఆసక్తిగా ఉన్నారు.
తక్కువ జనాభాతో కూడిన ఎక్కువ జిల్లాలు ఏర్పడితే పాలన సులభంగా ఉంటుంది. ప్రజలందరికీ ప్రభుత్వం దగ్గరవుతుంది. అప్పుడు అభివృద్ధి త్వరితగతిన జరుగుతుంది. దీని మీదే ప్రజలు ఆశలుపెట్టుకుని ఉన్నారు. కొత్త జిల్లాకు ఏర్పడితే సౌకర్యాలు కూడ పెరుగుతాయి. ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో సరైన ప్లానింగ్ అమలుచేస్తే అందరికీ అన్నీ అందుబాటులోకి వస్తాయి. పైగా కేంద్రం జిల్లాలను యూనిట్లుగా గుర్తించి నిధులు అందిస్తుంటుంది. ఆ లోకం ఎక్కువ జిల్లాకు ఉంటాయి కాబట్టి నిధులు కూడ అధిక సంఖ్యలోనే వస్తాయి.
అప్పుడు ఆర్థికంగా కూడ రాష్ట్రం కుదురుకుని వీలుంటుంది. ఈ శుభ పరిణామాలన్నీ జగన్ చేయబోయే కొత్త జిల్లాల ప్రకటన మీదే ఆధారపడి ఉంటాయి. కొత్తగా ప్రతిపాదిస్తున్న జిల్లాలుగా కోస్తాంధ్రలో గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, అమరావతి, ఒంగోలు, మార్కాపురం, నెల్లూరు, గూడూరు, మచిలీపట్నం, ఏలూరు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం కేంద్రాలుగా జిల్లాలుంటాయి. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, పలాస జిల్లాలు, రాయలసీమలో కడప, రాజంపేట, కర్నూలు, ఆదోని, నంద్యాల, అనంతపురం, హిందూపురం, చిత్తూరు, మదనపల్లి, తిరుపతి జిల్లాలు ఉంటాయి.