ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనలో మెనిఫెస్టో లో చెప్పిన 90 శాతం సంక్షేమ పథకాలు అమలులోకి వచ్చేసాయి. మిగతా పది శాతం ఫలాల్ని కూడా ప్రజలకి అందిస్తే! జగన్ మెనిఫెస్టో అమలు పరిపూర్ణం అయినట్లే. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వం స్పీడ్ అందుకుంది. జగన్ జెట్ స్పీడ్ తో కార్యక్రమాల్ని అమలు చేస్తున్నారని ఏడాది పాలనలోనే రుజువైంది. మధ్యలో కరోనా లాంటి మహమ్మారి ని ప్రజలపైకి దండెత్తినా జగన్ దూకుడు మాత్రం తగ్గించలేదు. కష్ట కాలంలో కూడా సంక్షేమాలను అమలు చేసుకుంటూ వచ్చారు. ఆ కరోనా మహమ్మారిపైనా ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుని ప్రభుత్వ యంత్రాంగం పనిచేసింది.
ఇక ఆరోగ్య రంగం విషయంలో జగన్ తొలి నుంచి ఎంత శ్రద్దతో పనిచేస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయంలో జగన్ తండ్రి వైఎస్సార్ ని మించి రెండు అడుగులు ముందులోనే ఉన్నారని నిరూపించుకున్నారు. తాజాగా ఆరోగ్య శ్రీలో మరో నూతన శకానికి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మరో ఆరు జిల్లాలకు అదనంగా ఆరోగ్య శ్రీ విస్తరణ సేవల్ని ప్రారంభించారు. వైద్య ఖర్చులు 1000 రూ..లు దాటితే ఆరోగ్య శ్రీ పరిదిలోకి తెస్తామని ఎన్నికలకు ముందు మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పైలెట్ ప్రాజెక్ట్ గా దీన్ని పశ్చిమగోదావరి జిల్లాలో జనవరి నుంచి అమలులోకి తీసుకొచ్చారు. తాజాగా విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూల్ జిల్లాల్లో కూడా అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
అతి త్వరలోనే మిగతా జిల్లాల్లోను అమలులోకి తెస్తామని సీఎం తెలిపారు. అలాగే ప్రతీ గ్రామానికి వైఎస్సార్ విలేజ్ క్లినిక్ తీసుకొస్తున్నామని ప్రకటించారు. అందులో 57 రకాల మందులు అందుబాటులో ఉంటాయని సీఎం జగన్ తెలిపారు. గతంలో ప్రభుత్వ అసుపత్రుల్లో మందులు తీసుకోవాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు అలాంటి భయాలు తొలగిపోయేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తమ సేవల్లో లోపాలుంటే అధికారులకు తెలియజేయాలన్నారు.