వైఎస్ జగన్ గత ఎన్నికల్లో చిరస్మరణీయమైన విజయాన్ని దక్కించుకోవడంలో ఆయనలోని చాలా లక్షణాలు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వాటిలో ప్రధానమైనది ప్రత్యర్థుల మీద ఆయన విరుచుకుపడే తీరు. చూసేందుకు నవ్వుతూనే కనబడే జగన్ విమర్శలు ఎత్తుకున్నారంటే ప్రత్యర్థులు కదిలిపోవాల్సిందే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి, ఆయన పాలన గురించి జగన్ విమర్శ చేసే తీరు చాలా ప్రత్యేకం. ఎవరి గురించి మాట్లాడినా శాంతంగా ఉండే జగన్ చంద్రబాబు పేరు పలకాల్సి వస్తే మాత్రం కోపంతో ఊగిపోయేవారు. రాష్ట్రాన్ని నాశనం చేశాడని విరుచుకుపడేవారు. ఆ ఎమోషన్ ఎన్నికల్లో బాగా పనిచేసింది. ఎంతో మంది ఓటర్లను ఆయన పట్ల ఆకర్షణకు గురయ్యేలా చేసింది. కానీ అధికారంలోకి వచ్చాక జగన్‌లో ఆ ఫైర్ తగ్గిందనే అనాలి.
ప్రతిపక్షం మీద విమర్శలు చేస్తున్నారు కానీ ఏమంత గట్టిగా చేయట్లేదు. చచ్చిన పామును మళ్లీ మళ్లీ చంపడం ఎందుకని అనుకున్నారో ఏమో కానీ చంద్రబాబును గతంలో మాదిరి ఎండగట్టడంలేదు. అసలు ఆయన నేరుగా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి మాటల దాడి చేసి చాలారోజులే అయింది. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు నాయకుడిలో ఫైర్ తగ్గిందా ఏమిటి అనుకున్నారు. కానీ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్ జగన్ బాబు మీద డైరెక్ట్ ఆటాక్ చేయడం చూసి లేదు లేదు… పాత జగన్ లోపలే ఉన్నాడు అనుకుంటున్నారు.
శుక్రవారం జగన్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దగ్గర్లో కృష్ణా నదిపై రూ.490 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల ప్రాజెక్టుకు క్యాంపు కార్యాలయం నుండి శంఖుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా మాట్లాడిన ఆయన బాబుగారి పాలనను ఎండగట్టారు. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జిల్లాలోని గ్రామాలు తాగునీటి కోసం కూడ కటకటలాడే పరిస్థితి. అయినా చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కడితే ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయని తెలిసి కూడ నిర్మాణం చేయలేదు, ఐదేళ్ళ పాలనలో గ్రాఫిక్స్ చూపి మాయ చేశారు అంటూ చంద్రబాబు నాయుడు పేరును పలుకుతూ దుయ్యబట్టారు. దీంతో నిన్న ఆయన మాట్లాడిన మాటలు వైసీపీ శ్రేణులకు కొంత ప్రత్యేకంగా వినబడ్డాయి.