విశాఖను పట్టుకు వేలాడుతున్న జగన్ స్టీల్ ప్లాంటును కాపాడగలడా ?

YS Jagan should save Vizag steel plant 
అమరావతిని కాదని మూడు రాజధానుల నినాదంతో అడుగులేస్తున్న సీఎం వైఎస్ జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానని అంటున్నారు.  ఇందుకోసం  గ్రౌండ్  వర్క్ కూడ జరుగుతోంది.  కోర్టులో స్టేటస్ కో తొలగడమే ఆలస్యం విశాఖలో కుర్చీ వేసుకుని కూర్చోవడానికి రెడీగా ఉన్నారు.  ఉత్తరాంధ్రను కూడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకుంటున్నారు.  అయితే విశాఖ పట్ల తమకు ఎంత మాత్రం కమిట్మెంట్ వుందో నిరూపించుకోవాల్సిన సందర్భం వచ్చింది వైసీపీ ప్రభుత్వానికి.  విశాఖ అనగానే మొదట గుర్తొచ్చేది ఉక్కు కర్మాగారం.  ఈ స్టీల్ ప్లాంటు విశాఖకు ఊరికే రాలేదు.  దీన్ని సాధించుకోవడం కోసం పెద్ద ఉద్యమమే నడిపారు ఆనాడు. 
 
YS Jagan should save Vizag steel plant
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మహామహులు కేంద్రంతో పోరాడారు.  సంవత్సరాలు తరబడి నడిచిన ఈ ఉద్యమంలో ప్రాణత్యాగాలు కూడ జరిగాయి.  ఆంధ్రా చరిత్రలో విజయవంతమైన ఉద్యమాల్లో ఇది కూడ ఒకటి.  22,000 ఎకరాలను త్యాగం చేశారు ఆనాటి విశాఖ జనం.  ఈ పరిశ్రమ ద్వారా లక్షమందికి పైగా ఉపాధిని పొందుతున్నారు.  దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ కర్మాగారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.  అలాంటి సంస్థను ఇప్పుడు కొద్దో గొప్పో కాదు పూర్తిగా 100 శాతం ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటోంది కేంద్రం.  బడ్జెట్ కేటాయింపుల్లో మొండిచేయి చూపించింది సరిపోక ఈ మెలికను తీసుకొచ్చి  పెట్టారు.  పెట్టుబడుల ఉపసంహరణలపేరుతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  
 
పరిశ్రమను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు ఇప్పటివి కావు.  ఛాన్నాళ్ల నుండే జరుగుతున్నాయి.  ఇప్పుడు ఊపందుకునే ఒక రోడ్ మ్యాప్ కూడ పడింది.  సుమారు లక్షన్నర కోట్ల విలువైన ఆస్తులున్న విశాఖ ఉక్కు పరిశ్రమ కొన్నాళ్లుగా నష్టాల్లో నడుస్తున్న మాట వాస్తవమే.  ఈ నష్టాల వెనుక కార్పొరేట్ శక్తుల ప్రభావం, రాజకీయ నాయకుల ప్రమేయం ఎంత ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.  కేంద్రం చేస్తున్న ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని గనుక జగన్ ప్రభుత్వం అడ్డుకోకపోతే ఆంధ్రుల ఆత్మగౌరవం మంటగలిసినట్టే.  ఏళ్ల తరబడి చేసిన ఉద్యమానికి, త్యాగాలకు ఎలాంటి విలువా లేకుండా పోతుంది.  ప్రభుత్వం దీన్ని కేవలం నష్టాల్లో నడుస్తున్న పరిశ్రమగా మాత్రమే చూడకుండా ఆత్మగౌరవ  చిహ్నంగా భావించి కాపాడుకునేందుకు గట్టిగా పోరాడాలి.