ఇంగ్లీషు మీడియం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలోనే చెప్పారు. వైసీపీ చెబుతూనే వుంది. నిజమే, ఇంగ్లీషు వల్ల లాభాలు చాలానే వున్నాయ్. మరి, తెలుగు వల్ల నష్టాలేంటో.! ఆ ఒక్క విషయంలోనే వైసీపీ బొక్కబోర్లా పడుతోంది.
సరే, ఈ రోజుల్లో విద్యార్థులంతా ఇంగ్లీషు మీడియం వైపే పరుగులు పెడుతున్నారన్నది కాదనలేని వాస్తవం. అలా ఇంగ్లీషు మోజు విద్యార్థులకీ, వాళ్ళ తల్లిదండ్రులకీ వుండబట్టే.. తెలుగు మీడియం వెలవెలబోతోంది. ‘కాన్వెంట్స్’ సంస్కృతి మొదలయ్యాక, సర్కారీ స్కూళ్ళకు వెళ్ళాలంటే అదో నామోషీ అయిపోయింది అందరికీ.
విద్య మీద ప్రభుత్వాలు వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయన్నది నిర్వివాదాంశం. అయినా, పేదవాడికి నాణ్యమైన విద్య అందడంలేదు. ఈ క్రమంలో ‘నాడు నేడు’ అంటూ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీన్ని అభినందించి తీరాల్సిందే.
సర్కారీ స్కూళ్ళ రూపురేఖలు మారుతున్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా రంగంలో తెచ్చిన అత్యంత కీలకమైన మార్పు ఇది. నిజానికి, ఇంగ్లీషు మీడియం కొత్త వ్యవహారమేమీ కాదు. గతంలో చంద్రబాబు హయాంలోనూ ఇంగ్లీషు మీడియంను ప్రోత్సహిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే, తెలుగు మీడియంని తొలగించి, పూర్తిగా ఇంగ్లీషు మీడియం చేయడమే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన కీలక మార్పు. తెలుగు చదవాలనుకునేవాళ్ళకి ఆ అవకాశమే లేకపోయింది. అదే సమస్య.