వైసీపీ నేతల మాటల దూకుడు మొదట్లో బాగానే అనిపించింది. వైఎస్ జగన్ సైతం తన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు పేల్చే మాటల తూటాలు చూసి నా బృందంలో తుపాకులున్నారు అంటూ సంబరపడిపోయారు. అంతెందుకు అసెంబ్లీలో ప్రతిపక్షంపై తన ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు విని జగన్ ముసిముసి నవ్వులు నవ్వుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఆ మాటలే తర్వాత తర్వాత జగన్‌కు తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఎమ్మెల్యేల నుండి మంత్రుల వరకు అందరూ సీఎం వద్ద మార్కులు కొట్టేయాలనే అత్యుత్సాహంలో అనేకసార్లు నోరుజారారు.
ఆమోదయోగ్యం కాని భాషను వాడటం, కోర్టుల మీద అనుచిత వ్యాఖ్యలు, అమరావతి రైతులను తిట్టడం, పెయిడ్ ఆర్టిస్టులని హేళన చేయడం ఇలా అనేక మార్లు మీడియా ముందే చిక్కిపోయారు. దీంతో అన్ని వైపుల నుండి ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తాయి. వాళ్ళలా మాట్లాడుతుంటే నాయకుడిగా వైఎస్ జగన్ మందలించరా అన్నారు. ఒకానొక దశలో జగన్ ప్రోద్బలంతోనే వారలా పేట్రేగిపోతున్నారని ప్రతిపక్షం దుయ్యబట్టింది. దీంతో తలపట్టుకోవడం జగన్ వంతైంది. అయితే తాజాగా తాను జస్టిస్ ఎన్వీ రమణ గురించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ గురించి మాత్రం ఎక్కడా మాట్లాడొద్దని పార్టీ నేతలకు జగన్ సూచించినట్టు తెలుస్తోంది.
సాధారణంగానే జగన్‌ను పొగడాలనే ఆతురుతలో నేతలు ఏదేదో మాట్లాడి బుక్కవుతూ వచ్చారు. ప్రధానంగా కోర్టు తీర్పుల నేపథ్యంలో వారి వ్యాఖ్యలు కోర్టు నోటీసులు పంపే వరకు వెళ్ళింది. రాష్ట్ర స్థాయి విషయాల్లోనే ఇలా ఆగం పట్టించిన నేతలు ఇక జగన్ ఎంతో సాహసంతో న్యాయవ్యవస్థ మీద యుద్ధం ప్రకటించిన పరిణామాన్ని ఊరికే వదులుతారా. తన నాయకుడిని పొగడటంతో పాటు పనిలో పనిగా రెండు మూడు ఆణిముత్యాలు వదిలారనుకోండి గోల గోల అయిపోతుంది. అప్పుడు జగన్ సాహసం గురించి మాట్లాడటం మానేసి అందరూ నేతల మాటల గురించే చర్చలు పెడతారు. అందుకే లేఖ గురించి ఎక్కడా, ఎవరూ మాట్లాడవద్దని, చెప్పాల్సింది ఎప్పుడో చెప్పేశాం.. అనే ఒక్క మాటతో సమాధానం ఇవ్వాలని పార్టీ పెద్దల ద్వారా తెలియజేశారని చెప్పుకుంటున్నారు.