వైసీపీలోకి కొత్త రక్తం.. 2040 కోసం సిద్దమవుతున్న జగన్

YS Jagan planning for 2040
వైసీపీలో నాయకులకు కొదవేమీ లేదు.  లెక్కకు మించినంత మంది నేతలున్నారు. కార్పొరేషన్లు, అభివృద్ధి మండళ్లు అంటూ కొత్త పదవులు సృష్టించినా ఒట్టి  చేతులతో మిగిలిపోయిన నాయకులు చాలామందే ఉన్నారు.  దశాబ్ద కాలం వయసు కూడ లేని వైసీపీలో మూడు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన బడా లీడర్లు  చాలామందే ఉన్నారు.  ఆ ప్రాంత ఈ ప్రాంతం అనే తేడా లేకుండా దాదాపు ప్రతి జిల్లాలోనూ పార్టీకి గట్టి అండదండలు ఉన్నాయి. ఈ అంశం ఒక రకంగా వైసీపీకి లభించినా ఇంకో రకంగా నష్టాన్ని కూడ కలిగించే  అవకాశం ఉంది.  ప్రస్తుతానికి సీనియర్ నాయకుల వలన శ్రేణులు  బలంగా ఉన్నాయి.  కానీ వారి తర్వాత ఆ శ్రేణులను నడిపించే  ప్రత్యామ్నాయాలు లేకపోతే చాలా కష్టం.  పార్టీకి లాంగ్ రన్ ఉండాలంటే యువ నాయకత్వం అవసరం.  
 
YS Jagan planning for 2040
YS Jagan planning for 2040
అలాగని ఇప్పటికిప్పుడు కొత్త లీడర్లను తయారుచేయడమంటే జరగని పని.  వారి జనంలోకి వెళ్లి కుదురుకోవాలంటే పదేళ్లకు పైగానే పడుతుంది.  ఇప్పటి నుండి పని ప్రారంభిస్తే అప్పటికి ఎంతమంది తేలుతారో చెప్పడం చాలా కష్టం,.  అందుకే జగన్ సరికొత్త వ్యూహం ఆలోచించారు.  అదే వారసత్వాన్ని పైకి తీసుకురావడం.  వైసీపీలో చాలామంది సీనియర్లకు వారసులున్నారు.  వారంతా తమ మజిలీ రాజకీయాలే అంటున్నారు.  నాయకులు కూడ ఏళ్ల తరబడి రాజకీయాలతో వేగి వేగి విసిగిపోయి తమ భాద్యతలను పిల్లలకు అప్పజెప్పాలని భావిస్తున్నారు.  కొందరు నాయకులు ధైర్యం చేసి ఇప్పటికే జగన్ వద్దకు ప్రస్తావనలు కూడ పంపారు.  వాటిని పరిశీలించిన జగన్ వారసులను పార్టీలోకి తీసుకురావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. 
 
ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ తన బంధువులను పార్టీలోకి తీసుకురాగా ఇప్పుడు కుమారుడిని తేరా మీదకు తీసుకొచ్చే పనుల్లో ఉన్నారు.  విజయనగరంలో శ్రేణులకు కుమారుడిని పరిచయం చేశారు.  వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారు.  పాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి తన కుమారుడు కాటసాని శివ నరసింహారెడ్డి కోసం వేదికను సిద్ధం చేస్తున్నారు.  ఆయన కూడ తన కుమారుడి 2024 ఎన్నికల్లో పాణ్యం టికెట్ ఇప్పించాలని చూస్తున్నారు.  టీడీపీ నుండి వైసీపీకి జైకొట్టిన కరణం బలరాం సైతం తన కుమారుడు వెంకటేష్ ను పక్కా ప్లాన్ ప్రకారం వైసీపీలో చేర్పించారు.  వచ్చే దఫా ఎన్నికల్లో అతనికి అద్దంకి టికెట్ ఇప్పించాలనుకుంటున్న.  
 
ఇక నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన సోదరుడు రూప్ కుమార్ యాదవ్ ను ప్రత్యక్ష ఎన్నికల్లోకి దించే ప్రయత్నాల్లో ఉన్నారు.  రూప్ కుమార్ ప్రస్తుతం జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు.  ఆయన దూకుడు చూస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ మీద ఆశలు పెట్టుకున్నట్టే ఉన్నారు.  అద్దంకి నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు బాచిన చెంచు గరటయ్య సైతం  వచ్చే ఎన్నికల్లో అద్దంకి నుండి టికెట్ తన కొడుక్కి ఇప్పించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.  వీరందరి తాపత్రయం జగన్ కు బాగా అనుకూలిస్తోంది.  ఈ వారసుల్లో గట్టి వారిని ఇప్పటి నుండే సిద్ధం చేసి ఇంకో 20 ఏళ్ల తర్వాత పార్టీకి పిల్లర్ల మాదిరి నిలబడేలా తయారుచేయాలనేది ఆయన  వ్యూహమాట.