ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్.. పంచెకట్టును ధరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం జగన్.. ప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం సీఎం జగన్ శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. అంతకు ముందే జగన్ బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.
గరుడ వాహన సేవ తర్వాత సీఎం జగన్.. పద్మావతి అతిథి గృహం చేరుకొని అక్కడే బస చేస్తారు. మళ్లీ గురువారం(24) ఉదయం 6.15 నిమిషాలకు వీఐపీ విరామ సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి సీఎం జగన్ స్వామి వారిని దర్శించుకుంటారు.
అనంతరం తిరుమలలో కర్ణాటక రాష్ట్ర చారిటీ సత్రాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి గన్నవరానికి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు.