ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనా పరంగా బిజీబిజీగా ఉంటున్నారు. సంక్షేమ పథకాలు, కేబినెట్ మీటింగ్‌లు, అమరావతి, పోలవరం, కేంద్రంతో సంబంధాలు.. ఇలా ఈ అంశాలపై చర్చించడానికే ఆయనకు తీరిక లేదు. ఈ క్రమంలోనే 13 జిల్లాల్లో పార్టీ పరమైన గొడవలు పరిష్కరించేందుకు ఆయన తనకు అత్యంత నమ్మకస్తులు అయిన నలుగురు నేతలను నియమించుకున్నారు. వైసీపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా 100కు పైగా నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య గొడవలు ఉన్నాయి.
అయితే జగన్ వీటిని పరిష్కరించే బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అప్పగించారు. అయితే వీరందరూ రెడ్డి సామాజిక వర్గం నేతలే అని ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ మాత్రం వీటిని పట్టించుకోలేదు. అయితే వీరిపై జగన్ ఎంత నమ్మకం పెట్టుకున్నా వీరు ఎన్ని పంచాయితీలు చేస్తున్నా అవేవి నాయకుల మధ్య విబేధాలను పరిష్కరించలేకపోతున్నాయట.
ఈ నలుగురిలో ఉన్నంతలో ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి ఒక్కరు మాత్రమే నేతల మధ్య సమన్వయం చేస్తున్నారని.. మిగిలిన వారు ఎన్నిసార్లు చెప్పినా నేతలు మాత్రం వీరి మాటలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. సుబ్బారెడ్డికి ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు ఉన్నా ఆయన టీటీడీ చైర్మన్ కావడంతో తిరుపతి లేదా.. అమరావతిలోనే ఉంటున్నారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా సైలెంట్‌గా ఉంటారు. అందుకే ఆయన చేసిన ఏ పంచాయితీ కూడా ఓ కొలిక్కి రాకుండా రెడ్డొచ్చే మొదలు కానే అవుతోందట.
ఇక సజ్జల రామకృష్ణా రెడ్డి తాడేపల్లి నుంచే ఫోన్లో పంచాయితీలు చేసేస్తున్నారట. దీంతో ఆయన పంచాయితీలు చేసిన చోట్ల పాత గొడవలకు తోడు కొత్త గొడవలు కూడా మొదలవుతున్నాయంటున్నారు. పైగా సజ్జల ఎవరో ఒకరికి కొమ్ము కాస్తుండడంతో మరో నేత / నేతలు పార్టీకి యాంటీ అవుతున్నారు. ఏదేమైనా జగన్ ఎంతో నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన ఈ నేతల తీరుతో వాళ్లపై నమ్మకం పోయే పరిస్థితులే ఉన్నాయి.