ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సడెన్ గా జగన్.. ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారు? అది కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. కేంద్రం వ్యవసాయ బిల్లులను ఆమోదించాక.. అనే ప్రశ్న అందరిలోనూ మెదిలింది. వైసీపీ ఎంపీలు కూడా అటు లోక్ సభలో.. ఇటు రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు మద్దతు తెలిపారు. నిజానికి సీఎం అయిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు వైఎస్ జగన్.. కేంద్రంతో సత్సంబంధాలే నెరుపుతున్నారు. ఏపీలో బీజేపీ, వైసీపీ బయటికి చూడటానికి కొట్టుకుంటున్నట్టు కనిపించినప్పటికీ… కేంద్రంలో మాత్రం వైఎస్ జగన్.. బీజేపీతో మంచిగానే ఉంటున్నారు.
ఈనేపథ్యంలోనే వైఎస్ జగన్.. ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే.. వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? జగన్.. అమిత్ షాకు ఏం చెప్పారు? అమిత్ షా.. జగన్ కు ఏం చెప్పారు? అనేదే ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశమైంది.
వాళ్లిద్దరు కలిసి గంటసేపు ముచ్చటించారట. అది అంతర్గత సమావేశం.. అంటే మూడో కంటికి తెలియదు. వాళ్లిద్దరికి తప్ప. కానీ.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో.. ఆ టాప్ సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది.
ముఖ్యంగా రెండు అంశాలు మాత్రం ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయట. ఒకటేమో రాజధాని భూముల కుంభకోణం అంశం.. దానిపై ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించాలనే డిమాండ్ ప్రధానంగా వినబడుతోంది. రెండో అంశం.. ఫైబర్ గ్రిడ్ కుంభకోణం. ఈ ప్రాజెక్టులో చాలా అవినీతి జరిగిందనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో దానిపై కూడా సీబీఐ విచారణ జరగాలనేది సీఎం జగన్ అభిప్రాయమనే వార్తలు వ్యక్తమవుతున్నాయి.
ఈ రెండు కుంభకోణాలపై సీబీఐ ఎంక్వయిరీ కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. కానీ.. సీబీఐ విచారణ అనేది అంత సులభం కాదు కదా. ఇప్పటికే అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ ఎంక్వయిరీకి కేంద్రం ఒప్పుకుంది. అయితే.. అన్ని విషయాల్లో అలా సీబీఐ ఎంక్వయిరీ వేయరు. దానికి తగ్గ ఆధారాలు ఉండాలి. లేకపోతే సీబీఐ విచారణకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాదు.
అందుకే.. జగనే స్వయంగా అమిత్ షాను కలిసి.. ఆ రెండు కుంభకోణాలకు సంబంధించిన బలమైన ఆధారాలను అమిత్ షాకు అందించినట్టు తెలుస్తోంది.
ఆ రెండు కుంభకోణాలకు… మాజీ సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ బాబుకు లింకులు ఉన్నాయి. అందుకే సీఎం జగన్ కూడా వాటిపై సీబీఐ ఎంక్వయిరీ వేయాల్సిందేనని.. అమిత్ షాను కోరినట్టుగా తెలుస్తోంది.
చూద్దాం.. మరి కేంద్రం ఈ కుంభకోణాలపై ఎలా స్పందిస్తుందో?