చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య రహస్య ఒప్పందం నడుస్తున్నదనే ఆరోపణలు నేరుగా ప్రభుత్వం నుండే వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను వాయిదావేసినప్పుడు తమ నోటీసుకు తీసుకురాకుండానే ఎన్నికలను ఎలా వాయిదావేస్తారు అంటూ ప్రభుత్వం ఫైర్ అయింది. నేరుగా సీఎం జగన్ మాట్లాడుతూ నిమ్మగడ్డ చంద్రబాబుకు అణుక్కోలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ నిమ్మగడ్డను పదవి నుండి తొలగించారు. ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే. ఎలాగో కిందా మీదా పడి ప్రభుత్వం మీద పైచేయి సాధించి మళ్ళీ పదవిలో నియమితులయ్యారు. మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలను నిర్వహించాలని పట్టుబట్టి ప్రభుత్వంతో మరోసారి కయ్యానికి దిగారు.
ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఎవరి వాదన, వారి నిర్ణయం సరైనదో న్యాయస్థానమే తేల్చుతుంది. అయితే ఈలోపు ఇరు వర్గాల మధ్యన విమర్శలు, ప్రతివిమర్శలు హోరెత్తుతున్నాయి. ఇప్పటికీ నిమ్మగడ్డ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని ఆరోపిస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు. తాజాగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ నిమగడ్డ చంద్రబాబు తొత్తుగా మారిపోయారని మాట్లాడారు. టీడీపీ అధికార ప్రతినిదిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పెట్టమంటేఎన్నికలు పెడుతున్నారు, వద్దంటే ఆపేస్తున్నారు. టీడీపీ నేతలతో ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చొని చర్చలు జరిపిన వ్యక్తి నిమ్మగడ్డ. కరోనా లేని సమయంలో వాయిదా వేసి కరోనా ఎక్కువుగా ఉన్న సమయంలో ఎన్నికలు పెడతామంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని నిమ్మగడ్డ రమేష్ పట్టించుకోలేదు అన్నారు.
దాని తర్వాతే అసలు విషయం చెప్పుకొచ్చారు ఆయన. టీడీపీ క్యాడర్ చంద్రబాబు కంటే నిమ్మగడ్డను ఎక్కుగా నమ్ముతున్నారని అంటూ నిమ్మగడ్డ పదవి నుండి దిగిపోయాక ఆయన్నే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగిస్తారని, చంద్రబాబును పక్కనపెట్టి టీడీపీ నేతలు పార్టీ పగ్గాలను ఆయన చేతిలోనే పెడతారనే అనుమానం కూడ ఉందని షాకింగ్ కామెంట్ చేశారు. దీన్నిపట్టుకుని వైసీపీ అభిమానులు జగన్ నిమ్మగడ్డను కూడ తెలియని ఒక పెద్ద సీక్రెట్ చెప్పారని, అది కేవలం టీడీపీ నేతల వద్ద మాత్రమే ఉన్న ప్లాన్ అని కామెడీ చేసేస్తున్నారు.