YS Jagan : సినిమా టిక్కెట్ల రగడ: జగన్ సర్కారుకే అడ్వాంటేజ్.!

YS Jagan : సినిమా టిక్కెట్ల రగడకు సంబంధించి వైఎస్ జగన్ సర్కారుకి తొలి విజయం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాల్ని ‘ఆన్‌లైన్’ చేయడంపై కొన్ని థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా, ‘ఆన్‌లైన్’లో టిక్కెట్లు అమ్మితే నష్టమేంటి.? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించడం గమనార్హం.

నిజానికి, ఇది జగన్ సర్కారుకి టిక్కెట్ల విషయంలో తొలి ఘన విజయంగానే చెప్పుకోవాలేమో. అయితే, కేసు విచారణ ఇంకా పూర్తయిపోలేదు. ప్రభుత్వం తరఫున కూడా వాదనలు జరగాల్సి వుంది. దానికి కౌంటర్ ఎటాక్ అవతలి పార్టీ నుంచి కూడా వస్తుందనుకోండి.. అది వేరే సంగతి.

అయితే, సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గించడంపై జగన్ సర్కారుకి ఎలాంటి సానుకూలత లేదా ప్రతికూలత వస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. నిజానికి, ఆన్‌లైన్ టిక్కెట్ల విక్రయం ద్వారా అక్రమాలకు చెక్ పడుతుంది. ఈ విషయమై పరిశ్రమ పెద్దలు కూడా జగన్ సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తెలంగాణలోనూ సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్ విధానం దిశగా కసరత్తు జరుగుతోంది.

కానీ, టిక్కెట్ల రేటు విషయమై మాత్రం గందరగోళం వుంది. కోట్లు ఖర్చు చేసి సినిమా తీసే నిర్మాతలు, వాటిని పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు, వాటిని ప్రదర్శించే థియేటర్ల యాజమాన్యాలు కాకుండా ప్రభుత్వమెలా టిక్కెట్ల ధరల్ని నిర్ణయిస్తుందన్నది ఓ వాదన.

ఈ వాదనలో పస ఎంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, చాలా అంశాలతో పోలిక వస్తుంది గనుక, జగన్ సర్కారు వాదన అంత సమంజసంగా కనిపించడంలేదు.