చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అమలుచేసిన ప్రతి పథకాన్నీ సమీక్షించే పనిలో పడింది ప్రస్తుత జగన్ సర్కార్. చంద్రబాబు, టీడీపీ నేతలు సంక్షేమ పథకాల పేరుతో నిధులు దిగమింగారనే అనుమానంతో ఈ సమీక్షలు స్టార్ట్ చేసింది. అమరావతి భూములు, ఈఎస్ఐ కుంభకోణం, పోలవరం టెండర్లు, ఏపీ ఫైబర్ గ్రిడ్, అన్న క్యాంటీన్లు ఇలా అనేక కార్యక్రమాల్లో గోల్ మాల్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వరుసగా ఒక్కో పథకాన్ని సమీక్షిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఎన్ఠీఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద ఖర్చు చేసిన 377 కోట్ల రూపాయల నిధులు ఎలా ఖర్చయ్యాయో తేల్చే పనిలో పడింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ సాయం కింద పన్నెడున్నర వేల కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే విదేశీ విద్యను అభ్యసించాలనుకున్న సుమారు 4528 మంది పేద విద్యార్థుల కోసం 377 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. అయితే ఈ లబ్ది పొందిన విద్యార్థులంతా టీడీపీ నేతలు, అనుకూలుర పిల్లలేనని, వారికి సొంతగా విదేశాలకు వెళ్లగలిగే స్థోమత ఉన్నా ప్రభుత్వ ఖర్చు వెళ్లారని, కేవలం పచ్చ కండువా కప్పుకున్న వారికే ఈ పథకమని అప్పట్లో అనేక విమర్శలు తలెత్తాయి. అయినా బాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.
కానీ తాజాగా జగన్ సర్కార్ ఈ పథకం కింద నిధులు విడుదలను నిలిపివేసి అసలు ఏ ప్రయోజనం ఉంటుందని 4528 మంది విద్యార్థుల మీద 377 కోట్లు వెచ్చించారు, లబ్ది పొందిన వారు నిజంగా పేదవారేనా, ఏ ప్రాతిపదికన నిధులు విడుదల చేశారు, ఒక్కో విద్యార్థి మీద ఎంత ఖర్చు పెట్టారు, లబ్ది పొందిన విద్యార్థులు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, ఇప్పుడేం చేస్తున్నారు అనే అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విచారణలో గనుక నిధులు టీడీపీ మనుషులకే వెళ్లాయని తేలితే మాత్రం చంద్రబాబుకు కొత్త తలనొప్పి తప్పదు. ఇక విదేశాల్లో ఉన్న తెలుగువారిలో ఎక్కువగా టీడీపీ అభిమానులు, ఒక సామాజికవర్గానికి చెందినవారే ఎక్కువగా ఉంటూ ఉంటారు. అక్కడ స్థిరపడిన వారి నుండి టీడీపీకి పెద్ద మొత్తంలో ఆర్ధిక సహకారం కూడ అందుతూ ఉంటుంది.