రాజకీయ నాయకులన్నాక పార్టీలు మారడం సహజం. అదికారం ఎక్కడ ఉంటే అక్కడే మకాం వేయాలని అనుకోవడం వారి సహజ శైలి. చాలా రాజకీయ పార్టీలు ఈ ధోరణికి అలవాటుపడే ఉంటాయి. ఎన్నికలు పూర్తయ్యాక ఈ గోడ దూకుడు కార్యక్రమాలు జోరుగా సాగుతాయి. 2014 ఎన్నికలు ముగిసి టీడీపీ అదికారంలోకి వచ్చాక వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి పిరాయించేశారు. ఈ పిరాయింపులు అప్పట్లో దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యాయి. ఆతర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీకి అదే 23 సంఖ్యలో ఎమ్మెల్యేలు మిలిగారు. అది వేరే సంగతనుకోండి. టీడీపీ ఓడిపోయాక ఆ పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీలో చేరడం జరిగింది. అది కూడ అతి కష్టం మీద.
దీంతో టీడీపీ నేతలు కొందరిలో వైసీపీలోకి వెళ్లాలనే కోరిక పుట్టుకొచ్చింది. పదవుల్లో ఉన్నవారైతే అనధికారికంగా వైసీపీ పంచన చేరాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల్లో ఓడినవారు, ఏ పదవీ లేని వారికి ఆ బాధలేదు. జగన్ ఒప్పుకుంటే దర్జాగా వెళ్లి చేరిపోవచ్చు. కానీ కొందరు టీడీపీ నేతలకు మాత్రం జగన్ దగ్గర ఈ వెసులుబాటు లేదట. వాళ్లే గతంలో వైసీపీ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి టీడీపీలోకి దూకేసిన 23మంది నేతలు. ఆనాడు వాళ్ళు పొడిన వెన్నుపోటుకు జగన్ చాలా బాధపడ్డారు. వాళ్ల మీద అనర్హత వేటు వేయాలని గొంతు చించుకున్నా ఎవ్వరూ వినలేదు. అందుకే ఈసారి బాల్ తన కోర్టులో ఉంది కాబట్టి జగన్ ప్రతాపం చూపిస్తున్నారు.
గతంలో తనను కాదని వెళ్లిపోయిన వారిలో కొందరు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో అందులోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారట. తమకు తెలిసిన మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా జగన్ కు టచ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారట. మేనేజ్ చేయాల్సిన కోటరీ నాయకులను మేనేజ్ చేశారట. ఇక జగన్ సరేనంటే వాళ్ళు వాళ్ళు పార్టీలో చేరిపోవడమే తరువాయి. ఇక్కడే జగన్ తన తిక్క లెక్క చూపించారు. గేటు దాకా వచ్చిన వాళ్లను అక్కడే నిలబెట్టేశారు. మోసం చేసి పోయిన వాళ్లను మళ్లీ తీసుకొచ్చి నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరుకు తెర లేపడం ఎందుకని ఎవరు ఎన్ని సిఫార్సులు చేసినా వాళ్ళని మాత్రం పార్టీలోకి రానిచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేశారట. దీంతో గతంలో జగన్ కు వెన్నుపోటు పొడిచిన నేతలంతా ఇప్పుడు బిక్క మొహం వేసుకుని వెనుదిరుగుతున్నారట.