రెండున్నరేళ్ళ ముందే ఎన్నికల సన్నాహాల్లో వైఎస్ జగన్.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు పూర్తవుతోంది. మరో రెండున్నరేళ్ళ సమయం వుంది వచ్చే ఎన్నికలకు. కానీ, ఇప్పటి నుంచే వైసీపీ ఎన్నికలకోసం సమాయత్తమవుతోందంటూ ప్రచారం షురూ అయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులకు ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారట. అది నిజమేనా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా వుండాలనే ఆలోచన చేయడం వింతేమీ కాదు. అధికారంలో వున్నోళ్ళకి ఈ టెన్షన్ ఇంకాస్త ఎక్కువగానే వుంటుంది. సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నా, ప్రజల్లో వ్యతిరేకత ఏమన్నా వుందా.? అన్నది తెలుసుకోవడం కష్టం.

మంత్రులు కింది స్థాయిలో పరిస్థితుల్ని అవగాహన చేసుకుని, ఏమన్నా సమస్యలుంటే ముఖ్యమంత్రికి తెలియజేయాల్సి వుంటుంది. కాగా, తెలంగాణలో కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్లే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే ఆలోచన చేస్తున్నారా.? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు పాదయాత్ర ప్లాన్ చేస్తున్నారన్నది ఓ ప్రచారం. ముఖ్యమంత్రి హోదాలో పాదయాత్ర అంటే అంత తేలిక కాదు. నిజానికి, అది సాధ్యమయ్యే పని కూడా కాదు. అదే సమయంలో, ముందస్తు ఎన్నికల కోసం వైఎస్ జగన్ రిస్క్ చేసే పరిస్థితి వుండకపోవచ్చు. కానీ, కేంద్రం జమిలి పేరుతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే.. ఆ పరిస్థితిని వైఎస్ జగన్ ముందే పసిగట్టి వుండొచ్చు.