ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానితో జరిపిన భేటీ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధికార వైసీపీ ఏమో జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానితో భేటీ అయ్యారని, 17 ప్రధాన అంశాల్లో మోదీ నుండి హామీ తీసుకువచ్చారని చెబుతుండగా ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఏమో తనమీదున్నఅవినీతి కేసులు త్వరలో విచారణకు రానుండటం వలన జగన్ భయపడి హుటాహుటిన మోదీ ముందు వాలిపోయారని అంటోంది. మరోవైపు ఎన్డీయేలో చేరే విషయమై చర్చించడానికి వెళ్లారని ఇంకొందరు అంటున్నారు. ఇలా ఎవరి వెర్షన్ వాళ్ళు చెబుతుంటే ఇప్పుడు కొత్తగా ఇంకో వెర్షన్ ప్రచారంలోకి వచ్చింది.
మోదీతో జరిగిన భేటీలో జగన్ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు గురించి చర్చించారని అంటున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాల్సి ఉంది. అంటే 175 నియోజకవర్గాలకు ఇంకో 50 అదనంగా పెంచి మొత్తం 225 స్థానాలు చేయాలి. 2019కి ముందే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. కానీ నియోజకవర్గాల ఏర్పాటు అంటే కేంద్రం జోక్యం ఖచ్చితంగా ఉండాలి. అది వాళ్ళ చేతుల్లో పని. 2019 ముందు బీజేపీ ప్రభుత్వం ఇతర పనుల్లో బిజీగా ఉండటం వలన అది జరగలేదు. అందుకే 2024 ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని జగన్ మోదీకి విజ్ఞప్తి చేశారట.
ఇంత హడావుడిగా ఈ విషయాన్ని జగన్ మోదీ ముందు ప్రస్తావించడానికి కారణం తెలుగుదేశం నేతలేనట. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా మారారు. రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఖచ్చితంగా టికెట్ ఆశిస్తారు. ఇప్పటికే వైసీపీలోనే కొందరు లీడర్లు గత ఎన్నికల్లో టికెట్లు దక్కక వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అలాంటప్పుడు టీడీపీ నుండి వచ్చినవారికి టికెట్లు ఇస్తే రచ్చ రచ్చ అయిపోతుంది. పైపెచ్చు 2024 నాటికి టీడీపీ నుండి చాలామంది ద్వితీయ శ్రేణి లీడర్లు వైసీపీలో చేరే అవకాశం ఉందట. వాళ్లలో కొందరికైనా టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నియోజకవర్గాల సంఖ్యను పెంచితే ఎలాంటి గొడవా లేకుండా ఆశావహులందరికీ టికెట్లు కేటాయించి న్యాయం చేయవచ్చనేది జగన్ ఆలోచనట. అంటే ప్రజెంట్ టీడీపీలో ఉన్న కొందరు లీడర్లకు 2024లో వైసీపీ తరపున ఎమ్మెల్యేలుగా పోటీచేసే యోగం ఉందన్నమాట.