ప్రతిపక్షం టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్లాలని చాలామంది నేతలు ఉవ్విళ్ళూరుతున్న సంగతి తెలిసిందే. అలాంటివారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడ ఉన్నారు. ప్రతిపక్షంలో కూర్చున్న కొన్ని నెలలకే వంశీకి బోర్ కొట్టిందో ఏమో తెలియదు కానీ పాలక వర్గంలోకి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. వెంటనే రాయబారం నడిపారు. గన్నవరంలో వంశీకి చాలా బలమైన క్యాడర్ ఉంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగల సత్తా ఆయన సొంతం. ఆయన అండ ఉంటే కృష్ణా జిల్లాలో పార్టీ బలపడటం ఖాయమని భావించిన వైసీపీ నేతలు ఇదే విషయాన్ని వైఎస్ జగన్ చెవిలో వేశారు. జగన్ బిజీ షెడ్యూల్లో కూడ వంశీని కలిసి అన్నీ మాట్లాడారు.
ఆ సమావేశంతో వంశీ తాను ఇక వైసీపీలో భాగమనే నిర్ణయానికి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో అంతా తానే అన్నట్టు వ్యవహరించడం స్టార్ట్ చేశారు. కానీ గన్నవరం వైసీపీ శ్రేణులకు వంశీ రాక నచ్చలేదు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడింది తామైతే ఇప్పుడు వంశీ వచ్చి అంతా నాదే అనడం ఏమిటని మండిపడ్డారు. వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావ్ ఇద్దరూ కలిసి వంశీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దీంతో వంశీ మరొక బృందం పెట్టుకుని గన్నవరం వైసీపీలో తనది కూడ ఒక బృందమని ప్రకటించుకున్నారు. దీంతో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి.
దుట్టా, యార్లగడ్డ వర్గాలు కలిసి వైసీపీ ముఖ్య నేతల వద్ద రాజకీయం స్టార్ట్ చేశారు. దీంతో వంశీ సైతం దూకుడుగా వెళ్లడం మొదలుపెట్టారు. తన గొప్పతనాన్ని చెప్పుకునే ప్రయత్నంలో జగన్ హవాలో కూడ గెలిచానని అంటూ తనను తాను జగన్ తో సమానంగా పోల్చుకున్నారు. దీంతో వంశీ వ్యతిరేక వర్గం ఆయన్ను బ్యాడ్ చేయసాగాయి. ఇక వంశీకి పార్టీలో ఉండే అవకాశం లేదని, జగన్ కూడ ఆయన మీద కోపంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. కానీ ఆలాంటిదేం లేదని, జగన్ వంశీకి ఎప్పుడో నేనున్నానని, చూసుకుంటానని మాటిచ్చినట్టు ఇంకొందరు చెబుతున్నారు. మొత్తానికి ప్రతిపక్షంలో ఉండాల్సిన వంశీని జగన్ పక్కనపెట్టుకుని అతని రాతనే మార్చేశారన్నమాట.