వైఎస్ జగన్ ఇదివరకటిలా అనుకున్నది చేసుకుంటూ వెళ్లిపోవట్లేదు. ముందు వెనుక చూస్తున్నారు. ఒక పని చేస్తే ఒక్క ప్రయోజనం కాదు పలు ప్రయోజనాలు ఉండేలా చూసుకుంటున్నారు. ఆ ప్రయోజనాల్లో ప్రధానంగా ప్రత్యర్థి పార్టీ టీడీపీని చావుదెబ్బ కొట్టే ఆస్కారం ఉందా లేదా అనేది చూసుకుంటున్నారు. ప్రస్తుతం జగన్ తలపెట్టిన పనుల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఒకటి. ఎన్నికల హామీల్లో భాగంగా ఒక్కొక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేయనున్నారు. ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. అధికారుల కమిటీలను నియమించి ఎలా ముందుకెళ్లాలి అనే విషయమై ఒక అవగాహన వచ్చేశారు సీఎం.
మొదట 13 పాత జిల్లాలకు కొత్తగా 12 కలుపుకుని మొత్తం 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వాటిని 32 జిల్లాలు చేయాలనే ఆలోచన ఉంది ఆయనలో. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎన్నికల హామీని నెరవేర్చడంతో పాటు ఇంకొన్ని ప్రయోజనాలను కూడ పొందేలా ప్రణాళిక వేసుకున్నారు జగన్. కేంద్రం జిల్లాలను యూనిట్ కింద పరిగణించి నిధులను కేటాయిస్తోంది. ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని ఎక్కువ నిధులు వస్తాయన్నమాట. 19 కొత్త జిల్లాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 19 యూనిట్ల సంఖ్య పెరిగి కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. వాటితో ఆర్ధిక భారంతో ఉన్న రాష్ట్రానికి కొంత రిలీఫ్ దొరుకుతుంది.
అలాగే తక్కువ మంది జనాభాకు జిల్లా రావడం మూలంగా అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. పాలన పరంగా మంచి సౌలభ్యం కూడ దొరుకుతుంది. అప్పుడు ప్రజలకు ప్రభుత్వం మరింత దగ్గరవుతుంది. అంతేకాదు కొత్త జిల్లాలు వస్తే కొత్త జిల్లా పరిషత్తులు వస్తాయి. వాటికి కేంద్రం నుండి నేరుగా నిధులు వస్తాయి. పార్టీలో పదవులు లేక అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలను జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో గెలిపించి సంతోషపెట్టవచ్చు . అప్పుడు కొత్త జిల్లా మీద పట్టు కూడ పూర్తిగా వైసీపీ పరమవుతుంది. ఇక తెలుగుదేశం కంచు కోటలుగా ఉన్న నియోజకవర్గాలు కొన్ని జిల్లాలు మారిపోతాయి. అప్పుడు ఆ పార్టీ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది. ఇలా ఒకే దెబ్బకు రెండు కాదు నాలుగైదు పిట్టల్ని కొట్టవచ్చనే ప్రణాళికలో ఉన్నారు జగన్.