తెలంగాణ రాజకీయాలు వేరు.. ఆంధ్రపదేశ్ రాజకీయాలు వేరు. దుబ్బాక, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో ఫలించిన రాజకీయ వ్యూహాన్ని తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో అమలు చేయాలని బీజేపీ అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. తెలంగాణ బీజేపీలో పలువురు అగ్రెసివ్ నాయకులున్నారు.. ప్రజా క్షేత్రంలో తమ బలం కాస్తో కూస్తో నిరూపించుకోగల శక్తి వారికి వుంది. కానీ, ఆంధ్రపదేశ్ బీజేపీలో అలాంటి నాయకుడెవరు.? అయినాగానీ, పులిని చూసి నక్క వాతలు పెట్టకున్న చందాన.. తెలంగాణ బీజేపీని చూసి, ఏపీ బీజేపీ.. వింత రాజకీయాల్ని ఆంధ్రపదేశ్ గడ్డ మీద చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘యేసుబాబు’ అని పేర్కొంది ఏపీ బీజేపీ. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు హయాంలో టీడీపీ స్టిక్కర్లు వేశారనీ.. వైఎస్ జగన్ హయాంలో వైసీపీ స్టిక్కర్లు వేస్తున్నారనీ సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తోన్న బీజేపీ, చంద్రబాబుని చందా బాబుగానూ, వైఎస్ జగన్‌ని యేసుబాబుగానూ అభివర్ణించడం వివాదాస్పదమవుతోంది.
ఈ వ్యూహాన్ని అధికార వైసీపీ ముందుగానే కనిపెట్టింది. ‘అరాచకం సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది..’ అంటూ తమ సొంత మీడియా ద్వారా వైసీపీ, బీజేపీ వ్యూహాల్ని బయటపెట్టింది. అయితే, అధికారంలో వున్న వైసీపీ, ఆ వ్యూహాల్ని పసిగట్టి.. అలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాల్సింది పోయి, అత్యంత వ్యూహాత్మకంగా ‘రాజకీయం’ చేస్తుండడమూ పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుపతి అంటే టెంపుల్ సిటీ. కానీ, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిల్లో కేవలం హిందువులే ఓటర్లుగా లేరు కదా.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఓ సందర్భంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో కన్వర్టెడ్ క్రిస్టియన్ల సంఖ్య వాస్తవ లెక్కల కంటే చాలా చాలా ఎక్కువని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో ఆ క్రిస్టియన్ ఓటు బ్యాంకు వైసీపీకి అండగా నిలబడింది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిదిలోనూ ఆ ఓటర్లు అత్యంత కీలకం కాబోతున్నారు. మరి, ఈక్వేషన్స్ ఇంత స్పష్టంగా కనిపిస్తోంటే, బీజేపీ ‘యేసుబాబు’ అనే ప్రకటన అంత నిర్లజ్జగా ఎలా చేసినట్టు.?