ఏ రాజకీయ పార్టీ అయినా, ఈ రోజుల్లో కుల సమీకరణాల చుట్టూ, మత సమీకరణాల చుట్టూ రాజకీయ ఆలోచనలు చేయాల్సిందేనేమో. మొత్తం రాజకీయ వ్యవస్థ అలా తయారైంది. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవిక్కడ. అన్ని రాజకీయ పార్టీలూ చేస్తున్నది అదే. మెగాస్టార్ చిరంజీవి చుట్టూ చాలా రాజకీయం నడుస్తోంది.. చిత్రమేంటంటే, ఈ రాజకీయంతో మెగాస్టార్ చిరంజీవికి అస్సలేమాత్రం సంబంధం లేకపోవడం.
సినీ నటుడిగా మెగాస్టార్ చిరంజీవి తన పని తాను చేసుకుపోతున్నారు. సేవా కార్యక్రమాల్లో జోరు పెంచారు. సినీ పరిశ్రమ పెద్దగా తన బాధ్యతల్ని మరింత బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడే కొందరికి కొంత ‘తేడా’ కనిపిస్తోంది. చూసే చూపులోని తేడా కారణంగా, చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం షురూ చేశారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి.. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా చిరంజీవి గురించి ఓ ఆలోచన చేయడంలో వింతేమీ లేదు. ఆయనకున్న ఛరిష్మా అలాంటిది.
సరే, రాజకీయ పార్టీ పెట్టి ఎందుకు సక్సెస్ కాలేకపోయారు చిరంజీవి.? అన్నది వేరే చర్చ. కానీ, చిరంజీవి బలాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా తక్కువ అంచనా వేయలేదు. అందుకే, ఆయనకు గాలం వేసేందుకు ఆయా పార్టీలు తమవంతు ప్రయత్నం చేస్తూనే వుంటాయి. ప్రధానంగా వైసీపీ, చిరంజీవిని తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాల్ని తీవ్రతరం చేసిందన్నది మీడియా వర్గాల్లో జరుగుతోన్న ఓ బలమైన ప్రచారం.
అయితే, ఈ విషయమై ఇంతవరకు వైసీపీ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. చిరంజీవి పట్ల సానుకూలంగా వైసీపీ నేతలెవరూ వ్యాఖ్యలు చేసిందీ లేదు ఈ మధ్యకాలంలో. కానీ, ఓ మంత్రిగారు చిరంజీవికి అత్యంత సన్నిహితుడు కాబట్టి, ఆయన ద్వారా మొత్తం వ్యవహారం నడుస్తోందన్నది బాగా వినిపిస్తోన్న టాక్.
మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి చూస్తే, రాజకీయాల పట్ల చిరంజీవి ఏ మాత్రం ఆసక్తితో లేరని తెలుస్తోంది. చిరంజీవికి ఆ ఆలోచన లేకపోయినా, రాజకీయ పార్టీలు ఊరుకుంటాయా.? ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అయితే, చిరంజీవి కోసం వైసీపీ నానా పాట్లూ పడుతోంది.. అన్న ప్రచారాన్ని సమర్థించలేం.. అలాగని పూర్తిగా కొట్టిపారేయలేం కూడా.