YCP : ఔనా.! అధికార వైసీపీలో అన్ని వికెట్లు పడతాయా.?

YCP : అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించేందుకు విపక్షాలు ఈ దుష్ప్రచారానికి తెరలేపాయా.? నిజంగానే, అధికార పార్టీలో ఆ పరిస్థితి వుందా.? ఏమోగానీ, అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులపై కింది స్థాయిలో జనం తీవ్ర అసంతృప్తితో వున్నారనీ, ఈ విషయమై ఎప్పటికప్పుడు అందుతున్న ‘ఇంటెలిజెన్స్’ (పార్టీ పరమైన నిఘా వ్యవస్థ) అందిస్తున్న సమాచారంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారనీ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

అందుకు తగ్గట్టుగానే, అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న మీడియా కూడా కొందరు వైసీపీ ప్రజా ప్రతినిథులకు వ్యతిరేకంగా కథనాల్ని తెరపైకి తెస్తుండడం గమనార్హం. నిజానికి, సోకాల్డ్ వైసీపీ మీడియా తనంతట తానుగా వండి వడ్డిస్తున్న కథనాలు కావివి. వాస్తవంగానే కొందరు ప్రజా ప్రతినిథుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అది, బాహాటంగానే వ్యక్తమవుతోంది కూడా.

నియోజకవర్గాలకు మంత్రుల్ని రానివ్వని స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు.. ఆయా నియోజకవర్గాల వైపు ఎమ్మెల్యేలను రానివ్వని సొంత పార్టీ కార్యకర్తలు.. ఇలా చాలా కథనాలే చూస్తున్నాం మీడియాలో. సోషల్ మీడియాలో అయితే కొందరు ప్రజా ప్రతినిథుల బాగోతాలు బీభత్సంగా సర్క్యులేట్ అవుతున్నాయి.

ఇవన్నీ వైసీపీ అధినాయకత్వం దృష్టికి వెళ్ళకుండా వుంటాయా.? ఖచ్చితంగా వెళతాయ్. మరి, చర్యలుంటాయా.? అంటే, ఎందుకుండవ్.. వుంటాయ్ గానీ.. దానికి కొంత సమయం పట్టొచ్చు. వచ్చే ఎన్నికల్లో సగానికి పైగా సిట్టింగ్ ప్రజా ప్రతినిథులకు టిక్కెట్లు దొరక్కపోవచ్చనీ, అందులో కొందరు మంత్రులు కూడా వుండొచ్చనీ అంటున్నారు. నిజమేనా.? అంత రిస్క్ అధికార వైసీపీ చేస్తుందా.? వేచి చూడాల్సిందే.