ఓ రెండు శాతం కూడా ఓటు బ్యాంకు లేని భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది.? అన్నది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ తర్వాత, ఆ స్థాయిలో హంగామా చేస్తున్న విపక్షం ఏదన్నా వుందంటే అది బీజేపీ మాత్రమే.
నిజానికి, బీజేపీ కంటే, కాంగ్రెస్ పార్టీ కాస్త బెటర్. ఈ రెండు పార్టీల కంటే జనసేన పార్టీకి మెరుగైన ఓటు బ్యాంకు వుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ రాష్ట్రంలో పుంజుకునేందుకు ప్రయత్నిస్తోందిగానీ, ఆ పార్టీకి సరైన నాయకత్వం లేదు. బీజేపీ విషయానికొస్తే, ఏపీ బీజేపీ తరఫున గట్టిగా మాట్లాడే నేతలు చాలామందే వున్నారు. కానీ, వారి మాటలకి అధిష్టానం దగ్గర విలువ లేదు.
ఏపీ బీజేపీ నేతల వ్యాఖ్యల్ని, ఏపీకి చెందిన కొందరు బీజేపీ నేతలే తప్పుపడుతుంటారు. అధిష్టానం, అలాంటివారిని అస్సలేమాత్రం వారించదు కూడా. బీజేపీలో చాలా గ్రూపులున్నాయి.. టీడీపీ, వైసీపీ, జనసేన గ్రూపులతోపాటు నిఖార్సయిన బీజేపీ గ్రూపు కూడా ఒకటి. ఈ గ్రూపుల మధ్య గొడవల కారణంగా, ఏపీ బీజేపీ ఏ విషయమ్మీదా ఖచ్చితత్వంతో నిలబడలేని పరిస్థితి.
ఇది అధికార పార్టీకి లాభించే అంశమే. ఎలాగూ, కేంద్రంతో అంశాల వారీగా సఖ్యత కొనసాగిస్తోంది జగన్ ప్రభుత్వం. కొన్ని విషయాల్లో కేంద్రం నుంచి సహకారం లేకపోయినా, మరీ కేంద్రం నుంచి ప్రభుత్వ పరంగా ఇబ్బందులేమీ లేకపోవడంతో వైసీపీ, బీజేపీని లైట్ తీసుకుంటోందని అనుకోవచ్చేమో. కానీ, రోజులెప్పుడూ ఒకేలా వుండవు. ఇంకో ఏడాది వరకూ ఇదే పరిస్థితి కొనసాగొచ్చు. కానీ, ఆ తర్వాత ఎన్నికల వాతావరణం షురూ అవుతుంది గనుక.. బీజేపీకి కూడా వైసీపీ నుంచి షాక్స్ తప్పవన్నమాట.