YCP Super Confident : ప్రత్యేక హోదా సాధించి తీరతామంటోన్న వైసీపీ, కానీ ఎలా.?

YCP Super Confident : ప్రత్యేక హోదా సాధించి తీరతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. కానీ, ఎలా.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ హయాంలో ప్రత్యేక హోదా ప్రకటితమైంది. దాన్ని అమలు చేయాల్సిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ.. అంటూ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వంచింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, హోదా దండగ.. ప్యాకేజీనే పండగ.. అని సెలవిచ్చారు.

ఇక, వైఎస్ జగన్ హయాంలో ప్రత్యేక హోదా అంశం మరింతగా తెరమరుగైపోయింది. ‘మా వల్లే ప్రత్యేక హోదా అంశం ఇంకా సజీవంగా వుంది’ అని వైసీపీ చెబుతున్నా, ప్రత్యేక హోదా సాధనలో.. 2019 నుంచి ఇప్పటిదాకా తాము ఏం చేసిందీ చెప్పుకోలేకపోతోంది ఆ పార్టీ.

నిజమే, 2014 నుంచి 2019 వరకు ప్రత్యేక హోదా కోసం వైసీపీ చాలా పోరాటాలు చేసింది. అయితే, అవి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాదనీ, అధికార పక్షం అనే హోదా కోసమే వైసీపీ ఆ ప్రత్యేక హోదా ఉద్యమాలు చేసిందని జనానికి అర్థం కావడానికి పెద్దగా సమయం పట్టలేదు.

సరే, కేంద్రంలో అధికారంలో వున్నవాళ్ళ చల్లని చూపు వుంటే తప్ప ప్రత్యేక హోదా రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదన్నదీ కఠోర వాస్తవమే. అయితే, కేంద్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న వైసీపీ ప్రభుత్వం, ఎందుకు కేంద్రాన్ని ఆయా సందర్భాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని ముందు పెట్టి, పంతం నెగ్గించుకోలేకపోతోంది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మాట్లాడుతూ, ప్రత్యేక హోదా సాధించి తీరతామని అంటున్నారు. అదెలా సాధ్యం.? అన్న ప్రశ్నకు మాత్రం వైసీపీ వద్ద సరైన సమాధానం లేదు. వైసీపీకి మిగిలింది రెండేళ్ళు మాత్రమే. ఆ తర్వాత రాజకీయం ఎలాగైనా మారొచ్చు. వైసీపీ గనుక అధికారం కోల్పోవాల్సి వస్తే.?

అప్పడు మళ్ళీ ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షల్ని వైఎస్ జగన్ షురూ చేస్తారేమో.!