గులాబీ డైరెక్షన్‌లోనే వైఎస్సార్సీపీ నడుస్తోందా.?

YCP Running

YCP Running : ఏ రాజకీయ పార్టీకైనా సొంతంగా కొన్ని వ్యవహారాలుంటాయి. ఇతర పార్టీలతో సంబంధం లేకుండా తమంతట తాముగా నిర్ణయాలు తీసుకోగలగాలి ఏ పార్టీ అయినా. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బీజేపీకీ, జనసేన పార్టీకీ, వామపక్షాలకీ స్క్రిప్ట్ వెళుతుంటుందని పదే పదే వైఎస్సార్సీపీ ఆరోపిస్తుంటుంది. మరి, ఆ వైఎస్సార్సీపీకి స్క్రిప్ట్ ఏ పార్టీ నుంచి అందుతోంది.?

గులాబీ పార్టీ నుంచి అందే స్క్రిప్టు ప్రకారం ఏపీలో అదికార పార్టీ వ్యవహరిస్తుంటుందన్న విమర్శ ఎప్పటినుంచో వుంది. అదెలా సాధ్యం.? అన్న ప్రశ్న సంగతి కాస్సేపు పక్కన పెడదాం. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేత కేటీ రామారావు కలిశారు. అది ఫెడరల్ ఫ్రంట్ కోసమంటూ టీఆర్ఎస్ చెప్పుకుంది.

గులాబీ పార్టీకి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, టీడీపీపై వ్యతిరేకత పెరిగేలా, వైసీపీ పట్ల ఓటర్లలో సానుకూలత పెరిగేలా వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం. తెలంగాణలో గులాబీ పార్టీకీ, ఏపీలో వైసీపీకీ ప్రచారం కోసం వాడే వాహనాలు సేమ్ టు సేమ్.. అంటూ ఫొటోలు, వీడియోల రూపంలో ఆధారాలూ వున్నాయి.

వీటన్నిటినీ క్రోడీకరించి.. గులాబీ పార్టీ, వైసీపీ ఒకటేనని అనగలమా.? రాజకీయాల్లో ఆరోపణలకు అర్థం పర్థం వుండదు. ఎలాగైతే టీడీపీ కార్యాలయం నుంచి జనసేన, బీజేపీలకు స్క్రిప్టు వెళుతోందని వైసీపీ ఆరోపిస్తోందో, గులాబీ పార్టీ నుంచి వైసీపీకి స్క్రిప్టు వెళుతుందనే ఆరోపణ రావడం కూడా అంతే సహజం.

ఒకవేళ ఏపీలో వైసీపీ గనుక ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపితే, గులాబీ స్క్రిప్ట్ అన్న విమర్శకు బలం చేకూరుతుంది.