వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్న మాట వాస్తవం. ప్రతి శుక్రవారం ఆయన విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాల్సి వున్నా, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా.. తనకున్న బాధ్యతల నిర్వహణ నేపథ్యంలో కోర్టు నుంచి కొన్ని వెసులుబాట్లు చట్టబద్ధంగానే పొందుతున్నారు.
అయితే, బెయిల్ మీదున్న వైఎస్ జగన్, సాక్షుల్ని ప్రలోభపెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. అంతే కాదు, న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేశారు.. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ. ఇదెక్కడి చోద్యం.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. నిజానికి, ఓ పౌరుడిగా ఆయన ఈ కేసు వేసి వుంటే అదో లెక్క. ఓ ప్రజా ప్రతినిథిగా కేసు వేసినా తప్పు పట్టలేం. కానీ, వైసీపీ నుంచి పదవి పొందిన రఘురామకృష్ణరాజు, ఆ పార్టీ ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేయకుండా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పిటిషన్ వేయడమేంటి.? రఘురామ, వైసీపీలో చేరినప్పటికే వైఎస్ జగన్ మీద కేసులున్నాయి.. అప్పుడేమో జగన్, రఘురామకృష్ణరాజుకి దేవుడు.. ఇప్పుడేమో ఇంకోలా కనిపిస్తున్నారంటే ఎలా.? తన అక్రమాస్తుల కేసులో తనతోపాటు నిందితులుగా వున్న కొందరికి తన ప్రభుత్వంలో కీలక పదవులు ఇవ్వడం ద్వారా సాక్షుల్ని, సహ నిందితుల్నీ ప్రలోభాలు పెడుతున్నారన్నది రఘురామకృష్ణరాజు ఆరోపణ. సీబీఐ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రఘురామ డిమాండ్ చేసేశారు. సీబీఐకి ఇవన్నీ తెలియదా.? అలాగని రఘురామ చెప్పదలచుకున్నారా.? ఏమో, రఘురామ పిటిషన్ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.