YCP MP : రెబల్ ఎంపీ రఘురామ బాటలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.?

YCP MP : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఈ మధ్యనే పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేస్తే, ఆయన మీద బ్యాంకుల్ని ముంచేసినట్లు ఆరోపణలున్నాయనీ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటు సాక్షిగా వైసీపీ ఎంపీలు నినదించిన సంగతి తెలిసిందే.

కానీ, ఇప్పుడు అదే వైసీపీ ఎంపీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పార్లమెంటులోనే తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. మోయలేనంత భారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తయారయ్యిందనీ, ఈ పరిస్థితుల్లో కేంద్రమే రాష్ట్రాన్ని ఆదుకోవాలని వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు.

మంచిదే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రానికి వివరించి, కేంద్రం నుంచి సాయాన్ని కోరడం తప్పు కాదు. రాష్ట్రానికి సాయం చేయడం కేంద్రం బాధ్యత. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించి, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందే కేంద్రం గనుక, రాష్ట్రాన్ని ఆదుకోవడం కేంద్రం బాధ్యత.

అయితే, రాష్ట్రంలో అంతా బాగానే వుందనీ, రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నామని పదే పదే వైసీపీ చెప్పుకోవడమే ఇన్ని సమస్యలకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వాస్తవాలు చెప్పకుండా ప్రభుత్వం దాచిపెడుతోందన్న సందేశాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామని అడ్డుకోవడం ద్వారా వైసీపీ చెప్పకనే చెప్పినట్లయ్యింది.

సరే, నిన్నటిదాకా ఏం జరిగిందన్నది అనవసరం. రేపట్నుంచి ఏం జరగాలన్నదానిపై ఇప్పుడు రాష్ట్రంలోని అధికార వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకుపోతూ, కేంద్రాన్ని నిలదీసే కార్యక్రమాలు చేపట్టాలి. లేదంటే, రాష్ట్రం మరింత అధోగతి పాలవడం ఖాయం.

ఇక్కడ బేషజాలకు పోవడానికేమీ లేదు. కేంద్రమే చెబుతోంది, రాష్ట్రం అమ్మ ఒడి లాంటి సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని. ఈ పరిస్థితుల్లో కేంద్రం తప్పుల్ని ఎత్తి చూపుతూ, కేంద్రం నుంచి సాయం పొందడం తప్ప వేరే మార్గమే లేదు.