ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రగడ: సజ్జల మార్కు స్పందన.!

ఇది కదా కావాల్సింది.! తప్పు జరిగిందా.? లేదా.? అన్నదానిపై నిజాలు నిగ్గు తేలాలి. ఈలోగా జరగాల్సిన రచ్చని ఆపాలంటే, అధికార పక్షం సరైన తీరున స్పందించి తీరాలి. అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ ఓ న్యూడ్ వీడియో కాల్ చేశారంటూ ఆరోపణలు వస్తున్న వేళ, కాస్త తటపటాయించినా.. చివరికి అధిష్టానం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని రంగంలోకి దించింది.

‘ఇప్పటికైతే అది మార్ఫింగ్ వీడియో అని గోరంట్ల మాధవ్ చెబుతున్నారు. నిజాలు నిగ్గు తేలాల్సి వుంది. పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. వీడియో నిజమని తేలితే పార్టీ పరంగా కూడా కఠిన చర్యలుంటాయి. ఇలాంటి ఘటనల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇంకెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటాం..’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఇటీవల ఇలాంటి అనుభవాల్ని తరచూ ఎదుర్కొంటోంది. వైసీపీ ఎమ్మెల్యే (అప్పట్లో మంత్రి) అవంతి శ్రీనివాస్ విషయంలో ఓ ఆడియో టేప్ కలకలం సృష్టించింది కొన్నాళ్ళ క్రితం. మరో వైసీపీ ఎమ్మెల్యే (ప్రస్తుతం మంత్రి) అంబటి రాంబాబుకి సంబంధించిన ఆడియో టేప్ కూడా వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టింది.

చిత్రమేంంటే, అంబటి అలాగే అవంతి విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ‘నిజమని తేలితే..’ ఆ ఇద్దరిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి కావొచ్చు, మరో వైసీపీ ముఖ్య నేత కావొచ్చు.. అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు.

అందుకే, పదే పదే వైసీపీ మీద బురద చల్లడం సర్వసాధారణమైపోయింది. ఒకవేళ గోరంట్ల మాధవ్‌ది తప్పని తేలితే, వైసీపీ చర్యలు తీసుకుంటే.. అది పెను సంచలమనే అవుతుంది. కానీ, ‘వంద శాతం అది మార్ఫింగ్ వీడియో’ అంటున్నారు గోరంట్ల మాధవ్.