YCP MLA’s : పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదిక్కడ.! ప్రశాంత్ కిషోర్.. అనే రాజకీయ వ్యూహకర్త. ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగిపోతుంటుంది. ఎందుకంటే, ఆయన రచించే వ్యూహాలు ఆయా రాజకీయ పార్టీలకు అంతలా ఉపయోగపడతాయి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ప్రశాంత్ కిషోర్.. అన్నది బహిరంగ రహస్యం.
వైసీపీకి ప్రశాంత్ కిషోర్ రచించే వ్యూహాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ళ ముందే పీకే టీమ్ సలహాలతో తమ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్రమత్తం చేశారు. పనితీరు బాగోకపోతే టిక్కెట్లు ఇచ్చేది లేదని వైఎస్ జగన్ హెచ్చరించిన దరిమిలా, తమ తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు పీకే బృందం వెనుక పరుగులు పెడుతున్నారట వైసీపీ ఎమ్మెల్యేలు.
నియోజకవర్గ ప్రజల దృష్టిలో మంచి మార్కులేయించుకునేందుకు ఏమేం చెయ్యాలన్నది పీకే బృందాన్ని అడిగి తెలుసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది వైసీపీ ఎమ్మెల్యేలకి. మరోపక్క, పీకే బృందాన్ని షాడోలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఫాలో అవుతున్నాయని తెలుస్తోంది.
ఇదిలా వుంటే, తెలంగాణలో టీఆర్ఎస్ కూడా పీకే బృందం సలహాల్ని తీసుకోనున్న సంగతి తెలిసిందే. ఇంకో చిత్రమైన విషయమేంటంటే షర్మిలకి కూడా పీకే బృందమే సాయం చేస్తోంది. ఆ పీకే బృందమే, ఏపీలో బ్రదర్ అనిల్ ద్వారా రాజకీయం చేస్తోంది. అంతా కలగాపులగం వ్యవహారంలానే కనిపిస్తోంది కదా.!
రాజకీయం అంటేనే అది మరి.!