గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పోరు నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఎక్కువ స్థాయిలోనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ యొక్క సానుభూతి పరులను గెలిపించుకొని తమ సత్తా చాటాలని సీఎం వైఎస్ జగన్ గట్టి పట్టుదలతో ఉన్నాడు, దీనితో ఎక్కువ స్థానాలు ఏకగ్రీవం కావాలని పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చాడు.
దీనితో అనేక చోట్ల సామ, దాన, భేద, దండోపాయాలను వాడుతున్నారు. అయినా.. పలుచోట్ల ఓటమి ఎదురవుతూనే ఉంది. మరోవైపు ప్రత్యర్థుల దూకుడుకు అడ్డుకట్టే వేసేందుకు మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో సీఎం జగన్ టార్గెట్లు అందుకోలేక మంత్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్వస్థల్లోనూ వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలం మరింత ఇబ్బందికరంగా తయారైంది.
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని స్వగ్రామం యలమర్రులో టీడీపీ మద్దతుదారు శిరీష భారీ విజయం సాధించింది. దీనితో కొడాలి నాని తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. దీనితో ఖంగారు పడ్డ మిగిలిన మంత్రులు తమ తమ సొంత స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం కింద మీద పడుతున్నారు. మొదటి రెండు దశలను పెద్దగా పట్టించుకోని వైసీపీ మంత్రులు మిగిలిన రెండు విడతలను చాలా సీరియస్ గా తీసుకున్నారు.
మరోపక్క వైసీపీ మంత్రులను టార్గెట్ చేస్తూ సత్తా చాటుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మంత్రులు లైట్ తీసుకున్న వారి స్వస్థలాల్లోనే గట్టి అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. అక్కడ గెలిపించుకొని పార్టీ సత్తా చాటాలని చూస్తోంది. టీడీపీ పార్టీ వారు ప్రత్యర్థి పార్టీలు వారు పుట్టిన స్థలాలు, మంత్రులు బలంగా భావించే పంచాయతీలను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయా స్థానాల్లో వైసీపీ గెలుపు ఇప్పుడు మంత్రులకు కీలకంగా మారింది.
నిజానికి పంచాయతీ ఎన్నికలకు పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఈ ధపా మాత్రం అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు కూడా ఇవి పార్టీ ఎన్నికలే అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరు పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరి మేము ఇన్ని స్థానాలు గెలిచాము అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పంచాయితీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ధోరణి ఏమిటో అర్ధం కావటం లేదు