పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణమరాజు సొంతపార్టీపై ఆరోపణలు చేసి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రఘురాంపై వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు మాటల దాడి చేయడం..ప్రతిగా రఘురాం వాటిని తిప్పికొట్టడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నిన్ననే వైకాపా పార్టీ నేతల నుంచి, కార్యకర్తల నుంచి తనకు ప్రాణ హాని ఉందని, సొంత పార్టీ నేతలే తనని చంపుతామని బెదిరించినట్లు కేంద్ర మంత్రి అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదుతో పాటు లేఖ రాసారు. రక్షణ కల్పించాలని కేంద్రంతో పాటు, ఏపీ పోలీసు అధికారులకు లేఖ రాసారు. తాజాగా ఆ వ్యాఖ్యలపై మంత్రి శ్రీరంగనాథరాజు కౌంటర్ వేసారు.
నర్సాపురం ఫ్యాక్షన్ ఏరియా అని రక్షణ కావాలా? మావోయిస్టుల ప్రాంతమని ప్రొటక్షన్ కావాలా? అని మండిపడ్డారు. రాష్ర్టంలో ప్రశాంత వాతావరణ ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఏపీలో ఎవరికి భద్రత కావాలన్నా ప్రభుత్వం కల్పిస్తుంద న్నారు. రఘురాం ఓ పార్లమెంట్ సభ్యుడు. ఆయన ఎప్పుడు నియోజక వర్గానికి వచ్చినా గౌరవంగా చూసుకుంటా మన్నారు. పూర్తిగా భద్రత కల్పిస్తామన్నారు. రఘురాం ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, 15 లక్షల మందికి ప్రజాప్రతినిధి అని గుర్తు చేసారు. నియోజక వర్గానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం సహకరిస్తామని మంత్రి తెలిపారు. మొత్తానికి వైకాపా మంత్రి కౌంటర్లు వేస్తేనే కవ్వించే ప్రయత్నం చేసారు.
రఘురాం వ్యవహారం ఇప్పటికే కంచికి చేరిందని వైకాపా వర్గాల నుంచి వినిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీపై అర్ధం లేని ఆరోపణలు చేసారని దీంతో అదిష్టానం ఆయనపై సీరియస్ గా ఉందని ప్రచారం సాగుతోంది. గీత దాటితే వేటు తప్పదన్నట్లు పార్టీ లో కీలక నేతలు హెచ్చరించడం జరిగింది. కానీ ఇంతలోనే అదే పార్టీకి చెందిన మంత్రి బుజ్జగిస్తూనే కౌంటర్లు వేయడం వెనుక అంతరార్ధం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. మరి మంత్రిగారి వ్యాఖ్యలపై రఘురా0 ఎలా స్పందిస్తారో చూద్దాం.