తెలుగులో మంచి కమెడియన్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న పృథ్వీరాజ్ త్వరలో జనసేన పార్టీలో చేరనున్నారనే సంగతి తెలిసిందే. గతంలో పలు సందర్భాల్లో పృథ్వీరాజ్ జనసేన గురించి అనుకూలంగా కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి సపోర్ట్ చేసిన పృథ్వీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఎస్వీబీసీ చైర్మన్ పదవిని పొందారు.
అయితే పదవిలో చేరిన కొన్ని నెలల తర్వాత ఒక వివాదంలో చిక్కుకున్న పృథ్వీ ఆ వివాదం వల్ల పదవిని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక మహిళతో హద్దులు దాటి మాట్లాడటంతో పృథ్వీరాజ్ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రోజుల్లో పృథ్వీరాజ్ వైసీపీకి పూర్తిస్థాయిలో దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత పృథ్వీరాజ్ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు.
టీడీపీ నేతలు గతంలో పృథ్వీరాజ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో పృథ్వీరాజ్ ఆ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపలేదు. మరోవైపు పృథ్వీరాజ్ జనసేనలోనే చేరడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. వాస్తవానికి జనసేనలో చేరిన వాళ్లకు ఎమ్మెల్యే టికెట్ లేదా ఎంపీ టికెట్ సులువుగా లభించే ఛాన్స్ అయితే ఉంది. వైసీపీ సస్పెండ్ చేసిన నేతలను జనసేన ఆదరిస్తుండటం గమనార్హం.
అయితే వైసీపీ నేతలు మాత్రం జనసేన పృథ్వీరాజ్ ను చేర్చుకోవడంపై విమర్శలు చేస్తుండటం గమనార్హం. ఒకే స్వభావం ఉన్నవాళ్లు ఒకే గూటికి చేరుతారని వైసీపీ నేతలు పృథ్వీరాజ్ గురించి కామెంట్లు చేస్తున్నారు. రాజకీయాల్లో సక్సెస్ కాకపోయినా మెగా హీరోల సినిమాలలో ఆఫర్లు పొందవచ్చని భావించి పృథ్వీరాజ్ పార్టీ మారుతున్నారని మరి కొందరు చెబుతున్నారు.